జమ్మూ కాశ్మీర్ లోని వ్యూహాత్మక సైనిక స్థావరం సియాచిన్ మంచు తుపానులో 25 అడుగుల లోతులో కూరుకుపోయి ఆరు రోజుల పాటు ప్రకృతితో పోరాడి ప్రాణాలు నిలుపుకున్న హనుమంతప్పను దేశం దక్కించుకోలేకపోయింది. ఢిల్లీలోని రీసెర్చ్ రిఫెరల్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో ఈ రోజు ఉదయం నుండి హనుమంతప్ప పరిస్థితి విషమించి, చివరికి 11.45 నిముషాలకు తుది శ్వాస విడిచారు.
హనుమంతప్ప ప్రాణాలు కాపాడడానికి గత మూడు రోజుల నుంచి ఆసుపత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫల యత్నాలుగానే మిగిలాయి. రెస్క్యూ సిబ్బంది మంచు వలయం నుండి తీసుకువచ్చే పాటికే కిడ్నీ, లివర్ దెబ్బ తినడంతో ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెబుతున్నారు. హనుమంతప్ప ఆరోగ్యం దాటిపోయిందని తెలియగానే చాలా మంది చాలా రకాలుగా ప్రార్ధనలు చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. వీర మరణం పొందిన ఆ వీర జవాను ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ…





