2015 సంవత్సరానికి గానూ ‘ఇండియన్’ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ‘దర్శక ధీరుడు’ రాజమౌళి కైవసం సొంతం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకున్న ఈ పురస్కారం జక్కన్న వశం కావడంపై సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రియాంకా చోప్రా, రన్వీర్ సింగ్, సంజయ్ బన్సాలి వంటి వారితో పోటీపడి మరీ, ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో ఈ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ రాజమౌళికి దక్కిందంటే… ఆ ఫలితం మొత్తం ‘బాహుబలి’ ప్రభావం మాత్రమేనని స్పష్టంగా చెప్పాలి.
కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న రాజమౌళిని ఈ సందర్భంగా… ‘బహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపారో సమాధానం కావాలని అడుగగా.., అది చెప్పకూడని విషయమని.., కేవలం ఒక్క సంవత్సరం ఆగితే దానికి పూర్తి సమాధానం దొరుకుతుందని చెప్పి… ఆడిటోరియంలో నవ్వులు పూయించారు. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్తున్న రాజమౌళి మన తెలుగు వాడైనందుకు గర్విస్తూ… ఈ సందర్భంగా జక్కన్నకు అభినందనలు తెలియజేద్దాం.





