నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీడియాకు అందించిన “రాగాల”తో వైసీపీ అధినేత జగన్ కు ‘కచేరి’ ప్రారంభమైనట్లే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ నుండి టిడిపిలోకి ప్రవేశించబోయే తొలి వికెట్ భూమా నాగిరెడ్డిదే అన్న విషయం 99 శాతం పరోక్ష వ్యాఖ్యలతో ఖరారయ్యింది. ఆ మిగిలిన ఒక్క శాతాన్ని అధికారికంగా చెప్పి పూర్తి చేయడమే ఆలస్యం. అది మరికొద్ది గంటల్లో కావచ్చు… మరికొద్ది రోజుల్లో కావచ్చు… అన్నవి భూమా వ్యాఖ్యలు.
ఇదిలా ఉంటే, ఇక జగన్ కు అసలు ‘మ్యూజిక్’ స్టార్ట్స్… మార్చి 5వ తేదీ లోపు ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారో అన్న విషయంపైనే ప్రస్తుత ఆసక్తి అంతా నెలకొందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలన్నీ తలెత్తడానికి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “21 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని, గంటలో ప్రభుత్వాన్ని కూల్చేయగలను” అని జగన్ చేసిన అసందర్భపు మాటలను అధికార పక్షం సీరియస్ గా తీసుకోవడంతో ఏర్పడిన పరిణామాలని విశ్లేషణలు వస్తున్నాయి.
ఓ వైపు పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు మార్చి 28వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలన్న నోటీసులతో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సాక్షి’ దినపత్రికను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో ఈ సమ్మర్ ముగిసే నాటికి వైసీపీ రాజకీయంగా ఏ స్థాయిలో ఉంటుంది? అన్న సమాలోచనలు జరుగుతున్నాయి. టిడిపి వర్గాలైతే ఇక వైకాపా మనుగడ కష్టమేనని అభిప్రాయ పడుతున్నాయి.



