ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతున్న “కృష్ణాష్టమి” ట్రిపుల్ ప్లాటినం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వం వహించగా సునీల్ హీరోగా నటించారు. ఒక పెద్ద హీరో చేయాల్సిన సినిమాలో సునీల్ ను ఎలా వచ్చాడు? దగ్గర నుండి ఈ సినిమా కోసం సునీల్ ఎంతలా కష్టపడ్డారు అన్న విషయాలను దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
పెద్ద హీరోల కాస్ట్యూమ్స్ కు కూడా ఖర్చు పెట్టని విధంగా ఈ సినిమాలో సునీల్ కాస్ట్యూమ్స్ కోసం దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేసామని, ప్రతి సీన్ లో సునీల్ పడే ‘తపన’ చూస్తుంటే మాకు ‘నస’లా అనిపిస్తుందని, అంతలా సునీల్ ‘ఇలా చేద్దామా… అలా చేద్దామా…’ అని తపన పడతారని, సునీల్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివానని, “ఇంత భారీ బడ్జెట్, నిర్మాణ విలువలు ఉన్న సినిమా మళ్ళీ తనకు దొరుకుతుందో లేదో అని సునీల్ అన్నారని,” మేం కూడా సినిమాకు అలాగే నిర్మించామని, అంతలా సునీల్ ను హీరోగా ఎలివేట్ సినిమా ఇదని దిల్ రాజు చెప్తుంటే సునీల్ కళ్ళు కన్నీళ్ళపర్యంతమయ్యాయి.
బహుశా తనను ట్రీట్ చేసిన విధానానికి గానీ, తన స్థాయికి మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టిన విధానానికి గానీ సునీల్ బాగా ఎమోషనల్ గా ఫీలవుతున్నారని అర్థమవుతోంది. చిత్రయూనిట్ భావించినట్లుగా సునీల్ రేంజ్ పెంచే సినిమాగా “కృష్ణాష్టమి” నిలవాలని ఆశిద్దాం.





