కామెడీ చిత్రాల హీరోగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సునీల్, ఒక కమర్షియల్ హీరోగా అవతారం దాలుద్దామని “కృష్ణాష్టమి” ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో మళ్ళీ ‘బ్యాక్ టు ఎంటర్టైన్’ అంటూ “జక్కన్న” రూపంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సునీల్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
బాలీవుడ్ లో ‘జిడ్’ వంటి హాట్ హాట్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన మనరా చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తొలి టీజర్ ను శనివారం నాడు ఉదయం 8.40 నిముషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్ లో చిత్ర యూనిట్ తెలిపింది. ‘ప్రేమకధాచిత్రమ్’ మేకర్స్ నుండి రాబోతున్న సినిమా టైటిల్, ప్రముఖ దర్శకుడు, టాలీవుడ్ నెంబర్ 1 అయిన రాజమౌళి ముద్దు పేరు ‘జక్కన్న’ కావడంతో, సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరిగింది.
మరి సక్సెస్ ఫుల్ దర్శకుడుగా ఎదిగిన రాజమౌళి మాదిరే, ఈ “జక్కన్న” కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారో లేదో చూడాలి. హీరోగా సునీల్ కెరీర్ కు ఈ ‘జక్కన్న’ విక్టరీ చాలా కీలకం కాబోతోంది. కమర్షియల్ హీరో నుండి మళ్ళీ కామెడీ హీరోగా మారిన సునీల్, ప్రేక్షకులు ఆశించే ‘ఎంటర్టైన్మెంట్’ను ఇవ్వగలిగితేనే విజయం వశమవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అయితే సునీల్ లుక్ ప్రామిసింగ్ గా ఉంది.





