ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకపై నిర్మాత దిల్ రాజు దాదాపుగా 30 నిముషాల పాటు ప్రసంగించారు. సాధారణంగా ఒక పెద్ద హీరోలు కూడా ఈ రేంజ్ ప్రసంగాలు చేయరు. మరి ఆ స్థాయిలో దిల్ రాజు ఎందుకు చేసారో, ఈ రోజు సినిమా విడుదలయ్యాక తెలిసి వచ్చింది. అలాగే సరిగ్గా “కృష్ణాష్టమి” విడుదలకు సరిగ్గా రెండు, మూడు రోజులు ముందరే ‘పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం నా జీవిత లక్ష్యం’ అని దిల్ రాజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా అవగతమైంది. అంతా సినిమా ఓపెనింగ్స్ కోసం చేసిన ‘పబ్లిసిటీ’ మాయలో అని విమర్శకులు తేల్చేస్తున్నారు.
“కృష్ణాష్టమి” ట్రైలర్ విడుదలైన తర్వాత ఒక పెద్ద హీరో రేంజ్ లో ప్రొడక్షన్ విలువలు ఉన్నాయని, బహుశా సునీల్ కు ఉన్న మార్కెట్ రేంజ్ ను ఈ సినిమా దాటిపోయిందేమోనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి, సినిమా విడుదల తర్వాత అవే నిజమయ్యాయి. ఒక కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ను జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ లాంటి పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకోరు. కమెడియన్ హీరోగా కామెడీ చిత్రాలనే ఎక్కువగా ఆశిస్తారు. సునీల్ ఖాతాలో హిట్లుగా చేరిన సినిమా కధలు కూడా అవే!
కానీ ‘కృష్ణాష్టమి’ విషయంలో లైన్ తప్పింది. సునీల్ దృష్ట్యా ఆలోచిస్తే హీరోగా మరో మెట్టు ఎదుగుతాననే నమ్మకంతో దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించి ఉంటారు కానీ, అసలు ఎదగాలంటే తనదైన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాలి కదా అన్న కోణంలో ఆలోచించినట్లు లేరు. ఫలితం… సినీ విమర్శకులను మెప్పించలేకపోయింది. దీంతో అంచనాలు తారుమారయ్యాయి. సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి వెలువడిన తొలి టాక్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో, సక్సెస్ పై గంపెడాశలు పెట్టుకున్న సునీల్ “కృష్ణాష్టమి” పాతాళానికి చేరినట్లేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.




