భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు మూల స్థంభమైన బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా బ్యాంకుల రుణాలను ఎగ్గొడుతున్న బడాబాబులపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. దేశంలో 500 కోట్ల పై చిలుకు బకాయిపడ్డ వ్యక్తిగత లేక కంపెనీల వివరాలు, సంబంధిత లెక్కలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు, సరైన మార్గదర్శకాలు లేకుండా, రికవరీ మెకానిజం వ్యవస్థ లేకుండా అంతటి భారీ రుణాలు ఎలా మంజూరు చేసారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రుణ ఎగవేత దారుల జాబితాను సీల్డ్ కవర్లో సమర్పించాలని చీఫ్ జస్టిస్ జిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ రిజర్వ్ బ్యాంకును కోరింది. గత త్రైమాసికంలో రుణ ఎగవేత దార్ల ప్రభావం దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులపై భారీగా పడింది.
వందల వేల కోట్లలో ఉన్న బాకీలతో నికర లాభం భారీగా తగ్గిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉండగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా అనేక ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణ ఎగవేత దార్లతో తమ నికర లాభాన్ని గణనీయంగా కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది.



