మత మార్పిడితో కుల గోత్రాలు వదులుకోవాల్సిందే!

Supreme Court Ruling on Conversion and SC Rights

దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున మతమార్పిడిలు జరుగుతూనే ఉన్నాయి. మతమార్పిడి అంటే క్రీస్టియన్ మతంలోకే అని వేరే చెప్పక్కరలేదు. గతంలో మావోయిస్టులలో చేరేందుకు ఎన్ని కారణాలు ఉండేవో అలాగే మత మార్పిడులకు కూడా అనేక కారణాలున్నాయి. ఇప్పుడు చర్చ మత మార్పిడి గురించి కాదు. మతం మారినా కులం, దానితో లభించే హక్కులు, ప్రయోజనాలు, సమాజంలో గుర్తింపు, గౌరవం వంటివి ఉపయోగించుకోవడం సమంజసమా కాదా? అనే దాని గురించి ఈ చర్చ.

ముందుగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు గురించి రెండు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది. క్రీస్టియన్ మతంలో కులాలు లేవు కనుక హిందూ మతంలో నుంచి ఆ మతంలోకి మారిన ఎస్సీలకు కులం, దాని ద్వారా లభిస్తున్న హక్కులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రక్షణ లభించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేవలం హిందూ, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

ఏపీలో బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో హిందూ (ఎస్సీ)కి చెందిన చింతాడ ఆనంద్ చాలా ఏళ్ళ క్రితం మతం మారి పాస్టర్‌గా మతభోధనలు చేస్తున్నారు. ఆయనకు, స్థానిక అక్కల రామిరెడ్డి తదితరులకు చర్చి విషయంలో ఘర్షణ జరిగింది. చింతాడ ఆనంద్ పిర్యాదు మేరకు పోలీసులు అక్కల రామిరెడ్డి తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

మతం మారిన చింతాడ ఆనంద్‌కు ఈ సెక్షన్స్ కింద రక్షణ లభించదంటూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేయగా అది కూడా హైకోర్టు తీర్పుని సమర్ధించింది.

ఏపీ విషయానికే వస్తే వివిద కులాలకు చెందినవారు క్రీస్టియన్ మతంలోకి మారుతుంటారు. కానీ వారిలో చాలా మంది తమ కులాలను, వాటి ద్వారా లభించే రిజర్వేషన్స్ వదులుకోరు. ఆ ప్రయోజనాలు పొందుతూనే కులం ద్వారా లభించే హక్కులు, రక్షణ కూడా పొందుతుంటారు. అది సరికాదని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ స్పష్టం చేశాయి.

కనుక సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం మతం మారిన వారందరినీ రిజర్వేషన్స్ కోటా నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి వస్తున్న వారికే మన రాజకీయ పార్టీలు ఆధార్, రేషన్ కార్డు వంటివి ఇచ్చి జనాభాలో కలిపిస్తున్నప్పుడు, దేశంలోనే పుట్టి పెరిగి మతం మారిన వారి కుల హక్కులు, రక్షణ రద్దు చేస్తాయానుకోవడం దురాశే అవుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories