డీఎస్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్స్‌తో వైసీపీ చేతి నిండా పని కల్పించిన కూటమి ప్రభుత్వం, మరోసారి పని కల్పిస్తోంది. ఈసారి గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-1లో 166 పోస్టుల భర్తీకి నేడు ఏపీపీఎస్సీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముందుగా ఈ నోటిఫికేషన్ గురించి చెప్పుకున్న తర్వాత వైసీపీ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుందాం.
నేటి నుంచి ఈ నెల 27వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అర్హత కలిగిన అభ్యర్ధులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వీటిలో డిప్యూటీ కలెక్టర్: 12 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్: 14, డీఎస్పీ (సివిల్): 36, డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 3, డీఈవో: 14, ఆర్టీవో: 3, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 35, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 12, డిప్యూటీ రిజిస్ట్రార్: 16 పోస్టులు ఉన్నాయి.
డీఎస్పీ పోస్టులకు వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ళు. మిగిలిన పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ళు. పోస్టులను బట్టి విద్యార్హతలు, ఇతర నిబంధనలు మారుతాయి. వీటికి సంబంధించి రిజర్వేషన్లు, జోన్ల వారీగా ఖాళీలు, అర్హతలు, ఇతర వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
డీఎస్సీ తర్వాత వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం ఖచ్చితంగా ముమ్మాటికి కుట్రే. డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గందరగోళ పరిచి ఉద్యోగాల భర్తీ చేసేడ్డామనుకోవడం కుట్ర కాక మరేమిటి?
డీఎస్సీ పై సీబీఐ విచారణ జరిపించమంటే జరిపించలేదు. కనీసం మంత్రి నారా లోకేష్‌ని రాజీనామా చేయమంటే చేయలేదు. కనుక డీఎస్సీ.. సారీ… ఏపీపీఎస్సీ ఉద్యోగాల విషయంలో వైసీపీ పిర్యాదులను, విమర్శలను పట్టించుకుంటారనుకోలేము. కనుక మళ్ళీ ఆందోళనలు చేయక తప్పదు. చేతి నిండా పని కల్పించినందుకు థాంక్స్!





