విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా ఏదో ఒక కొత్త ఆర్థిక ఇబ్బంది వస్తూనే ఉంది. ఏదొక కారణాలతో ఊహించని ఆర్థిక భారాలు వచ్చిపడుతుండడంతో రాష్ట్రం కోలుకొవడానికి అవకాశం లేకుండా పోతోంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయ పన్ను వ్యవహారం కూడా అలాంటిదే! కార్పొరేషన్ 1400 కోట్లు పన్ను చెల్లించలేదని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ వినిపించిన వాదనకు హైకోర్టు కూడా అంగీకరించి, వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరటనిచ్చే తీర్పును వెలువరించింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఆదాయపు పన్ను 1400 కోట్లు చెల్లించాలన్న ఉమ్మడి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ శనివారంనాడు తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ బెవరైజేష్ కార్పొరేషన్ 2012-13 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆదాయాన్ని బడ్జెట్లో చూపకుండా మినహాయిస్తూ ఆదాయపు పన్ను చెల్లించకుండా ఎగవేశారంటూ ఆదాయ పన్ను శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1400 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయగా, దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సందర్భంలో జరిగిన ఉదంతం ఇది.





