మరో సినీ ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ‘లవ్’ సినిమాలో నటించి, ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్న వర్ధమాన నటి స్వాతిరెడ్డి వీరప్రేమగాధ ఇది. ‘తన కూతురును గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ చేసారని’ ఆమె తల్లి నాగేంద్రమ్మ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ కు చేరుకున్న స్వాతిరెడ్డి తల్లిపై మరో కేసు పెట్టి పోలీసులకు ట్విస్ట్ ఇచ్చింది.
‘తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే ఇష్టపూర్వకంగా తన తల్లి నుండి వెళ్లిపోయానని, డబ్బుల కోసం తన తల్లి వేధిస్తోందని’ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అవాక్కైన పోలీసులు ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి పోలీస్ స్టేషన్ లోనే కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో ఇద్దరినీ విడదీసి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
కౌన్సిలింగ్ తో ఇద్దరూ రాజీపడని పక్షంలో కేసులను కొనసాగిస్తామని, లేని పక్షంలో కౌన్సిలింగ్ తో సరిపెడతామని పోలీసులు చెప్తున్నారు. స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ ఆరోపిస్తున్న శ్రీనివాస్ రెడ్డి నుండి కూడా పోలీసులు విచారణ చేసి స్టేట్మెంట్ తీసుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యవహారాలు ఇలా పోలీసు గుమ్మం ఎక్కడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. ‘గ్లామర్’ ప్రపంచం మాయ!



