రోజుకో ‘జంపింగ్ జిలానీ’తో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తున్నారని అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్న టి-టిడిపి నేతలు, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అదే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నారో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని విమర్శకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. ప్రస్తుతానికి ఏ పార్టీ వారిని తెలుగుదేశం ఆహ్వనించనప్పటికీ, జగన్ వైఖరి నచ్చని కొందరు వైసీపీ నేతలు టిడిపిలోకి వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపధ్యంలో టిడిపిని ఇరుకున పెట్టేందుకు, టీఆర్ఎస్ – వైసీపీ శ్రేణుల నుండి వస్తున్న విమర్శలు ఇవి.
అయితే, ఈ రాజకీయ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా… ఏ పార్టీకైనా, పార్టీ అధినేతలకైనా కొన్ని రాజకీయ విలువలకు కట్టుబడాల్సి ఉంటుంది. అలా అయితేనే ప్రజల్లో వారి పట్ల విశ్వాసం స్థిరంగా, మెండుగా ఉంటుంది. అది చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, ఇంకెవరైనా గానీ..! కేవలం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్దులతోనే పార్టీని నడిపించాలి. అప్పుడే వారు ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలకు గౌరవం ఇచ్చిన వారవుతారు, అలాగే పది మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు.
అలా కాక ఇతర పార్టీల నుండి నేతలను దిగుమతి చేసుకుంటే వారి పార్టీలో నేతలు పెరుగుతారు కానీ నాయకత్వం తగ్గి, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్న చందంగా తయారవుతుంది. ఒకప్పుడు ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే అధికార పార్టీ పని తీరు అంతలా బాగుంటుందని, ప్రజలకు అంత మేలు జరుగుతుందని నాటి రాజకీయ నాయకులు భావించేవారు. మరిప్పుడు ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉంటే అధికార పార్టీకి అంత హక్కులు వస్తాయని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడే రాజకీయ నాయకులపై ప్రజలలో విశ్వాసం కలుగుతుంది.
తప్పు ఎక్కడైనా తప్పే… తప్పు ఎవరికైనా తప్పే… అది చంద్రబాబు చేసినా… కేసీఆర్ చేసినా… జగన్ చేసినా… (ఈ అంశంలో జగన్ కు అవకాశం లేదనుకోండి… అది వేరే విషయం…), ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినా సరే..!





