2014లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టింది మొదలు కేసీఆర్ ను అనేక మార్లు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాలనా విభాగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ సాగుతున్న ఈ ఒరవడి… రెండేళ్ళు గడిచినా ఇంకా కొనసాగుతుండడం విశేషం. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో పాలనలో కొన్ని లోపాలు జరుగుతుండడం సహజమే అన్న వాదనలకు విలువ లేకుండా… రెండేళ్ళు గడిచినా… అవే తప్పులు వివిధ విభాగాలలో స్వయంగా హైకోర్టు ఎత్తి చూపడం ప్రత్యర్ధి వర్గాలకు కేసీఆరే ఒక ఆయుధం ఇచ్చినట్లవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ కోసం జీవో నెం 123ను ప్రయోగించడం కుదరదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాకుండా మెజారిటీ రైతులు డిమాండ్ చేసే ధరలనే పరిహారంగా చెల్లించి భూములను సేకరించాలని కూడా పకడ్బందీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో షాక్ తిన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మరో మొట్టికాయ వేసినట్లయ్యింది. హైకోర్టులో ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగలడం గతంలో ఏ ప్రభుత్వం చవిచూడని అంశం కావడంతో ప్రతి సందర్భంలోనూ ఈ విషయం ‘హైలైట్’ అవుతోంది.





