
తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్‌ని కొట్టే మొగాడే లేడని ఆయనతో సహా బిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకునేవారు. నిజానికి కేసీఆర్ జాతీయ స్థాయి నాయకుడని, ప్రధానిగా దేశాన్ని ఏలాల్సిన కేసీఆర్, ప్రజల అదృష్టం కొద్దీ తెలంగాణలో జన్మించారని, ఆయన కారణ జన్ముడని అతిశయోక్తిగా చెప్పుకునేవారు కూడా.
అలాంటి కేసీఆర్‌ని రేవంత్ రెడ్డి ఓడించి మూలకూర్చోబెట్టారు. అంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్ప వ్యూహకర్త అని స్పష్టం అవుతోంది.
కానీ నేటికీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ రేవంత్ రెడ్డి గొప్పదనాన్ని అంగీకరించలేకపోతున్నారు. వారు గుర్తించినా గుర్తించకపోయినా, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్‌ని దెబ్బ మీద దెబ్బ తీస్తూనే ఉన్నారు. ఆ బాధని కేసీఆర్ మౌనంగా దిగమింగుతూనే ఉన్నారు.
శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతునే ఉన్నారు. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ నెలాఖరులోగా మరో 5-6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఫిరాయింపుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే చాలా తెలివిగా వ్యవహరిస్తూ కేసీఆర్‌తో మైండ్ గేమ్ ఆడుతుండటం విశేషం.
రేవంత్ రెడ్డి తలుచుకుంటే కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి పార్టీలో చేర్చేసుకోవచ్చు. కానీ వారానికి ఒకరిద్దరిని మాత్రమే చేర్చుకుంటున్నారు.
తద్వారా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతోందనే వార్తలు నిత్యం మీడియాలో వచ్చేలా చేస్తూ కేసీఆర్‌ని, ఆ పార్టీలో మిగిలిన నేతలని కూడా మానసికంగా దెబ్బ తీస్తున్నారు.
అందువల్లే కేసీఆర్ ఎన్ని పిట్ట కధలు చెపుతున్నప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆయన మాటలు నమ్మడం లేదని చెప్పవచ్చు. ఈ వన్ బై వన్ చేరికలతోనే పార్టీ మారాలనే ఆలోచన లేని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నారని చెప్పవచ్చు.
కనుక కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్పగా పాలన చేయలేకపోవచ్చు కానీ కేసీఆర్ కంటే గొప్పగా రాజకీయాలు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
రేవంత్ రెడ్డి రాజకీయంగా తప్పటడుగులు వేస్తే దెబ్బ తీయాలని కేసీఆర్ కాసుకు కూర్చుంటే, కేసీఆర్ చేతే తప్పటడుగులు వేసేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పక తప్పదు.
కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపడమే ఇందుకు నిదర్శనం. ఒకవేళ కేసీఆర్ బీజేపీతో రహస్య అవగాహనకు ప్రయత్నిస్తే, కేసీఆర్ విశ్వసనీయత మరింత దెబ్బ తింటుంది. అది బిఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని వేరే చెప్పక్కరలేదు.
ఈ దేశంలోనే నా అంత రాజకీయ మేధావి మరొకరు లేడని కేసీఆర్ గట్టిగా నమ్మేవారు, తన పార్టీ నేతలను, ప్రజలను కూడా నమ్మించారు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ చతురత ముందు కేసీఆర్ దిగదుడుపే కదా?
After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…
Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…