
ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతీ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి కావు. రాజకీయాలలో అవొక సర్వసాధారణ ప్రక్రియగానే చూసేవి. ముఖ్యంగా అప్పటికి రాజకీయాలు ఇంతగా దిగజారిపోలేదు. కనుక మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు పెద్దగా హడావుడి లేకుండానే అలవోకగా జరిగిపోతుండేవి.
కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలకి ప్రతీ చిన్న ఎన్నికా ప్రతిష్టాత్మకమే. జీవన్మరణ సమస్యగానే భావిస్తుంటాయి. కనుక వాటి కోసం జరిగే పోటీ, ప్రలోభాలు, ఫలితాలు, పర్యవసనాలు అన్నీ కూడా అదే నిష్పత్తిలో ఉంటున్నాయి.
కానీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడిన ఆ ఎన్నికలలో ఓడిపోగానే అదేమి అంత ముఖ్యమైన ఎన్నిక కాదనో లేదా 11 సీట్లు గెలిచినా నైతికంగా మేమే గెలిచామనో లేదా మరో కుంటిసాకో చూపించి తమ ఓటమిని తేలికగా కొట్టి పడేస్తుంటాయి రాజకీయ పార్టీలు. అది వేరే సంగతి.
ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇదే జరుగుతోంది. ఈ 13న ఫలితాల తర్వాత ఇలాంటి మాటలే వినబోతున్నాము.
అయితే ‘మరో 10-15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని’ సిఎం రేవంత్ రెడ్డి, ‘కాంగ్రెస్ పార్టీకి ఇదే మొదటి మరియు చివరిసారి… మళ్ళీ మేమే అధికారంలో వస్తామని’ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ బల్లలు విరిగిపోయేలా గుద్ది వాదిస్తున్నారు.
కనుక 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలకు నేడు జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి.
పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మద్యనే ఉంది. కనుక ఏది ఓడినా దాని పర్యవసానాలు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి.
ముఖ్యంగా కేసీఆర్ లేని బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్, హరీష్ రావులు సొంతంగా గెలిపించుకోగలరో లేదో ఈ ఫలితాలతో తేలిపోతుంది.
ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇద్దరూ ఒడ్డున పడతారు లేకుంటే కల్వకుంట్ల కవిత ఉండనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి! ‘గుంటనక్క’ వల్లే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఆమె ఇప్పటికే స్టేట్‌మెంట్ రెడీ చేసి పెట్టుకునే ఉన్నా ఆశ్చర్యం లేదు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడితే సిఎం రేవంత్ రెడ్డి కుర్చీ కింద కుంపట్లు రాజుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, రూ.1600 కోట్లు విలువైన సింగరేణి నైనీ బ్లాక్ దక్కించుకోవడానికి ఇద్దరు సీనియర్లు పోటీ పది ఆబాసుపాలయ్యారు కనుక. వారిలో ఎవరో ఒకరు పావులు కదపకపోరు.
కానీ ఈ వంకతో రేవంత్ రెడ్డిని దించేసుకుంటే, ఆ తర్వాత కేసీఆర్ బారి నుంచి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఏ సీనియర్లు కూడా కాపాడలేరని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కనుక ఈ ఎన్నికలని సిఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. పైగా అధికారం, యంత్రాంగం అంతా చేతిలో ఉంది కనుక కాంగ్రెస్ గెలుపు ఖాయమే అని భావించవచ్చు.
గెలిచిన పార్టీకి ప్రజాధరణ తమకే ఉందని చెప్పుకునే వెసులుబాటు ఎలాగూ లభిస్తుంది. అంతకు మించి ఎన్నికలలో ఎలా గెలవాలో ‘పోల్ మేనేజ్‌మెంట్’ బాగా అబ్బిందని కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలోతోనే స్పష్టమవుతుంది కూడా!
The stage is being set for the upcoming local body election in Andhra Pradesh as…
Bollywood's biggest film Ramayana could face a massive setback in the US market, with its…