
రాజకీయాలలో ఉన్నవారు సవాళ్ళు విసరడం సులభం. కానీ ఆ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పేరుతో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ పేరుతో రాజకీయ డ్రామాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు భావిస్తే ఆశ్చర్యం లేదు.
ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో కూర్చొని కాంగ్రెస్ మంత్రుల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతుంటే, మరోవైపు పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో మరో రాజకీయ హైడ్రామా మొదలైంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ తదితరులు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకుని మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమని ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ నేతలు తమను ఎదుర్కొనే ధైర్యం లేక మొహం చాటేశారని ఆరోపించారు.
ఒకవేళ రెండు పార్టీల నేతకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఓ తేదీ, సమయం, వేదికను నిర్ణయించుకొని, ప్రజలు లేదా మీడియా ముందే చర్చకు కూర్చోవచ్చు కదా?
ఉదాహరణకు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్ధులు ఇద్దరూ ఇలాగే చేసి, ప్రజామోదం పొందుతుంటారు కదా? అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు కూడా ఎదురెదురుగా నిలిచి చర్చించి తమ వాదనలు నిజమేనని నిరూపించుకోవచ్చు కదా? అప్పుడు ప్రజలు కూడా వారి పక్షాన్నే నిలుస్తారు కదా? కానీ ముగ్గురూ మూడు చోట్ల నిలబడి ప్రత్యర్థిని పిలవడం రాజకీయ డ్రామా అనిపిస్తోంది కదా?
రాజకీయాల్లో సవాళ్ళు ఎవరి వాదనలో నిజమెంత ఉందని తేల్చుకోవడానికే తప్ప రాజకీయంగా ప్రత్యర్ధిపై పైచేయి సాధించామని చెప్పుకోవడానికో లేదా మీడియా కోసమో కానే కాదు.
ప్రత్యర్ధులను ధైర్యంగా ఎదుర్కొని తమ వాదనలను నిరూపించుకునే ధైర్యం లేనప్పుడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు దేనికి? ఇటువంటి డ్రామాల వలన ఏం ప్రయోజనం? ఏం సాధిస్తారు?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…