
తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా కృష్ణా నదీజలాల మీద, సాగు నీటి ప్రాజెక్టుల మీద అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్దాన్ని కొనసాగిస్తూనే, అక్కడితో ఆగకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా “ఛలో మేడిగడ్డ” కార్యక్రమాన్ని చేపట్టింది అధికార కాంగ్రెస్.
అయితే గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ఆ నాటి నాయకుల నిర్ణయాలను తప్పుబడుతూ అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి, అధికార పార్టీని ఇరుకునపెట్టడానికి నల్గొండ ప్రజల సాక్షిగా “ఛలో నల్గొండ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ.
అయితే రెండు పార్టీల నేతలు బాహాబాహీ విమర్శలకు దిగి ఎవరి బలమెంతోవారు ప్రదర్శించే ప్రయత్నం చేసారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు అప్పుడే బీటలు వారాయంటూ, పిల్లలర్లు దెబ్బతిన్నాయంటూ సీఎం రేవంత్ తో పాటుగా మంత్రులు ఆ పార్టీ ఎమ్మెల్యే లు మేడిగడ్డ చేరుకొని అక్కడ అధికారులతో చర్చించారు.
ప్రాజెక్టులో లోపాలు బయటపడుతాయనే భయంతోనే బిఆర్ఎస్ నేతలు ఎవ్వరు ఇక్కడికి రాలేదు అంటూ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కాళేశ్వరం డిజైన్ లోనే లోపాలు ఉన్నాయంటూ మంత్రి తుమ్మల, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఇలా గత ప్రభుత్వ పెద్దల హయాంలో జరిగిన అవకతవకలను ప్రజల ముందు ఉంచారు కాంగ్రెస్ నాయకులు.
అయితే అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ రచ్చకు నల్గొండ వేదికగా కౌంటర్ ఇవ్వడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థులను బయపెట్టగలిగిన కేసీఆర్ అదే మాటలతో ప్రజలను మాయ చేసి తనవైపుకు తిప్పుకోగలరని మరోసారి రుజువు చేసుకున్నారు.
ఛలో నల్గొండ కు బస్సులో బయలుదేరిన బిఆర్ఎస్ నాయకుల పై గుడ్లతో దాడి చేసి గో బ్యాక్ అంటూ నల్ల చొక్కాలతో నిరసన తెలియచేసారు NSUI కార్యకర్తలు. దీనితో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. అయితే ఎన్నికల తరువాత బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందునా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంతో వేలాదిమంది బిఆర్ఎస్ కార్యకర్తలు, నల్గొండ ప్రజలు సభకు హాజరయ్యారు.
సభావేదిక సాక్షిగా అధికార పార్టీ నేతలపై మాటల తూటాలనే పేల్చారు కేసీఆర్. మీకు పాలన చేతగాక మా పై నిందలు వేస్తారా..? నా పై విమర్శలు చేసి మీరు పెద్దనాయకులు అయిపోదామని కళలు కంటున్నారా…? కేసీఆర్ ని తిరగనివ్వం అంటూ సవాల్ విసిరేంత మగాళ్లా మీరు..? నన్ను చంపి ఈ రాష్ట్రంలో ఉండే దమ్ముందా మీకు..? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ నే మీరు తిరగనివ్వరా..? అంటూ అధికార పార్టీకి హెచ్చరికలు పంపుతూ ప్రజల్లో సానుభూతి సంపాదించే ప్రయత్నం చేసారు కేసీఆర్.
మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో..? ఎవరికి ప్రజల మద్దతు దొరుకుతుందో..? ఎవరి విమర్శలను ప్రజలు నమ్ముతున్నారో, ఎవరి పట్ల సానుభూతి చూపిస్తారో తెలియాలంటే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు. అప్పటి వరకు ఈ రెండు పార్టీల మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుందనేది స్పష్టం.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…