గత కొంత కాలంగా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు చూస్తుంటే.. ఈమాత్రం కంటెంట్ చూడడానికి థియేటర్ దాకా రావాలా? అనే ప్రశ్న ప్రతి ప్రేక్షకుడి మనసులో మెదిలింది. ఆల్రెడీ సమ్మర్ సీజన్ మొత్తాన్ని ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయకుండా గాలికొదిలేశారు, అది సరిపోదన్నట్లు విడుదలవుతున్న చిన్న సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్ ను కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి.
ముఖ్యంగా గత మూడు వారాల్లో విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేకపోయింది. దానికి కారణం ఐపీఎల్, టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్లు అని చెబుతుంటారు కానీ.. సినిమాలో కంటెంట్ లేకపోవడం అనేదాన్ని మాత్రం ఇటు ఫిలిం మేకర్స్, అటు ఇండస్ట్రీ అంగీకరించరు.
గతేడాది “లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, కపుల్ ఫ్రెండ్లీ” లాంటి చిన్న సినిమాలు థియేటర్లకి జనాల్ని రప్పించగలిగాయి కదా?. డీసెంట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఆ సినిమాలు వర్కవుట్ అయ్యి.. మిగతా సినిమాలు వర్క్ అవ్వకపోవడానికి ఏకైక కారణం కంటెంట్. ఈ విషయాన్ని ఒప్పుకొని, ప్రమోషన్స్ కంటే కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిన సమయం వచ్చింది.
ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లో చూడాలి, లేకపోతే మంచి ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతాం? అనే భావన ప్రేక్షకుల్లో కలిగించలేకపోతే.. అది ఫిలిం మేకర్స్ ఫెయిల్యూర్. ఈమధ్యకాలంలో ఏ సినిమా అలాంటి భావన కలిగించింది? ఈ ఏడాది విడుదలవ్వనున్న సినిమాల్లో “పెద్ది, రణబాలి” లాంటి సినిమాలు తప్ప ఏదీ ఆసక్తికరంగా లేదు.
ప్రేక్షకుల చేతుల్లో ఓటీటీలు వచ్చాక పరిస్థితులు మారిపోయాయి.. జనాల మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉన్న కంటెంట్ కి మించిన ఎంటర్టైన్మెంట్ ఆఫర్ చేస్తేనే థియేటర్లకి వస్తారు. లేకపోతే.. కొన్నాళ్ళకి 8 వారాల ఓటీటీ విండో కోసం పోరాడే స్థాయి నుండి 8 రోజుల ఓటీటీ విండో కోసం ధర్నాలు చేసే స్థాయికి తెలుగు సినిమా దిగజారిపోతుంది. ఇప్పటికైనా ఫిలిమ్స్ మేకర్స్ కటెంట్ మీద దృష్టి సారించకపోతే.. ఆడియన్స్ ఓన్లీ పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో చూసి.. మిగతా సినిమాలన్నీ ఓటీటీలో మాత్రమే చూస్తారు.
ఇది M9 అభిప్రాయం మాత్రమే కాదు.. నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఇదే విషయాన్ని చాలా నిక్కచ్చిగా ట్వీట్ చేశాడు. బ్యాడ్ ఫిలిమ్స్ చూడడానికి జనాలు థియేటర్లకి ఎందుకు రావాలి? అంటూ ప్రశ్నించాడు. మరి ఇండస్ట్రీ దగ్గర దీనికి సమాధానం ఉందా? కనీసం రెస్పాండ్ అయ్యే స్థితిలో ఉన్నారా?
Coincidentally, Rahul echoes us: “There Is No Goddamn Passion.” https://t.co/0zDchraL0e pic.twitter.com/iFoA7OltU6
— M9 NEWS (@M9News_) May 12, 2026




