ప్రజలకు వినోదం పంచే సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు వారివే..

Telugu Film Industry Producers and Actors

పీత కష్టాలు పీతవన్నట్లు సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు వారికున్నాయి. అవి వివిధ సందర్భాలలో బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సినీ పెద్దల దృష్టికి వస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకుని ఉంటే సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టేవి కదా?

సమ్మర్ హాలీడేస్ సినిమా ప్రెస్‌మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, “వెంకటేష్‌- త్రివిక్రమ్‌ సినిమా ఓ నాలుగు రోజులు ముందూ వెనుకా అయినా తప్పక జనాలు వస్తారు. సినిమా చూస్తారు.

ADVERTISEMENT

కానీ మా ‘సమ్మర్ హాలీడేస్’ వంటి చిన్న సినిమా చెప్పిన సమయానికి విడుదల చేయకపోతే, సినిమాకు చాలా నష్టం జరుగుతుంది. అక్టోబర్‌ 30న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని, ఉన్న డబ్బంతా ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసేశాము. కానీ ఆ రోజు విడుదల చేయలేక నవంబర్‌ 6కి మార్చుకోవాల్సి వచ్చింది.

కనుక మళ్ళీ ఇప్పుడు అప్పు తెచ్చి ప్రమోషన్స్ నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇందుకు మేము ఎవరినీ నిందించడం లేదు. కానీ పెద్ద సినిమాలు వాయిదా వేసుకుంటున్నప్పుడు ఆ విషయం మాకు తెలియజేస్తే మేము ఆ స్పేస్ వాడుకోగలుగుతాము కదా?” అని అన్నారు.

‘దొంగ నా కొడుకు’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్లో యువ నటుడు మౌళి తనూజ్‌ మాట్లాడుతూ, “నేను సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉండి ఉంటే నా గురించి అందరూ ఇంత చులకనగా మాట్లాడగలిగేవారా?నా స్థాయి నాకు తెలుసు కనుక సినిమాల కోసం ఎవరేమన్నా నోరు మూసుకొని అన్నీ భరిస్తున్నా.

లిటిల్ హార్ట్స్ హిట్ కొట్టిన తర్వాత కూడా నా పట్ల ఎవరి అభిప్రాయాలు మారలేదు. ఆ తర్వాత ఓ రోజు నాకు జ్వరం వచ్చి ఇంట్లో పడుకొని ఉంటే, ఒకరు ఫోన్ చేసి మా ఫంక్షన్‌కు రావాలని పిలిచారు. జ్వరమని చెపితే ‘అయితే వచ్చే సినిమాకు నెగెటివ్ రివ్యూ వేస్తామని బెదిరించాడు. చేసేదేమీ లేక జ్వరంతోనే అతను చెప్పిన ఫంక్షన్‌కు అటెండ్ అయ్యాను. నేటికీ నా పరిస్థితి ఇదే. కానీ సినిమాల కోసం అన్నీ భరిస్తున్నాను,” అని చెప్పాడు.

మరో సీనియర్ నటి రజిత తాజా ఇంటర్వ్యూలో “మగ నటులు ఎంత సీనియర్ అయినా వారిని తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. అదే.. మహిళా నటులు కాస్త సీనియర్ అవగానే తీసి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మా మొహాలు మరీ రెగ్యులర్ అయిపోయాయంటారు. మరి ఇదే నియమం మగ నటులకు ఎందుకు వర్తించదు? అని మేము అడిగితే అందరికీ కోపాలు వస్తాయి.

సరే మేమేమీ ఖుష్బూ, టబూలా ఏ-గ్రేడ్ పాత్రలు చేయాలని ఆశ పడటం లేదు. కనీసం బీ-గ్రేడ్ పాత్రలైనా మాకు ఇమ్మనమని దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రజిత అన్నారు.

సాయి దుర్గ తేజ్ హీరోగా చేస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా నిర్మాతలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల చేయవద్దని, చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని వారు బెదిరించినట్లు ఆ వార్త సారాంశం.

ఈవిధంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎవరిని కదిపినా ఒక్కో సమస్య బయటపడుతూనే ఉంటుంది. సమస్యలు కొండల్లా పేరుకుపోతున్నా పట్టించుకునే నాధుడు లేడు.

ఎందుకంటే ఎవరికీ ఆలోచించే తీరిక ఆసక్తి లేవు. ఒకవేళ ఉన్నా అటువంటి ప్రయత్నం చేస్తే చేజేతులా ఓ కొత్త శత్రువుని సృష్టించుకున్నట్లే అవుతుంది. కనుక ఎవరి తిప్పలు వారు పడాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories