రెండేళ్లు గడగడా వణికించిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ తో చైనాలో మళ్ళీ పుట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యింది. విదేశీ ప్రయాణికుల వల్ల ఇండియాలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. జనం కొన్ని నెలల నుంచే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఒకటి రెండు శాతం మినహాయించి అందరూ మాస్కులకు స్వస్తి చెప్పేశారు. ఎయిర్ పోర్ట్స్ లో సైతం వీటికి సడలింపు ఇవ్వడం ఇటీవలే జరిగింది. థియేటర్లు షాపింగ్ మాల్స్ ఎప్పటిలాగే నిండుగా కళకళలాడుతున్నాయి. ఇంకిప్పట్లో ఎలాంటి ముప్పు లేదనే రీతిలో ప్రభుత్వాల నుంచి సంకేతాలు వచ్చాక మరోసారి ఇలా జరిగితే తట్టుకోవడం కష్టమే.
ఈ వార్త తెలియడం ఆలస్యం ముందు వణుకుతుంది సినీ పరిశ్రమే. వందల కోట్ల నుంచి వేల కోట్లకు విస్తరించిన టాలీవుడ్ లో పదుల సంఖ్యలో ప్రాజెక్టులు ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఒక్క ప్రభాస్ మీదే మూడు వేల కోట్లకు పైగా బిజినెస్ ఆధారపడి ఉంది. ఇక అందరి లెక్కలు చెప్పుకుంటూ పొతే ఆ ఫిగర్ కు ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పేందుకు గూగుల్ క్యాలికులేటర్ వాడాల్సి వస్తుంది. పచ్చగా మునుపటి పరిస్థితులకు వెళ్తున్న టైంలో కరోనా మళ్ళీ వస్తోందన్న వార్త ప్రేక్షకుల్లోనూ ఖంగారు పుట్టిస్తోంది. వ్యాక్సిన్లు వేసుకున్నా వేసుకోకపోయినా ఏదో ఒక రూపంలో పబ్లిక్ అనారోగ్యం బారిన పడుతూనే వచ్చారు.
ఎలా చూసుకున్నా ప్రజలకు ఎంటర్ టైన్మెంట్ అనేది ఎప్పటికీ ప్రాముఖ్యత పరంగా కిందే ఉంటుంది. సినిమాలు ఎంత విరగబడి చూస్తున్నా ప్రాణం కాపాడుకునే రిస్క్ విషయంలో ఇంటిపట్టునే ఉండేందుకు ఇష్టపడతారు కానీ థియేటర్ కు వెళ్లి జనం మధ్య కూర్చోరు. ఒకవేళ మళ్ళీ లాక్ డౌన్ లేదా నిబంధనలు లాంటి తలనెప్పులు వస్తే తట్టుకోవడం కష్టం. మొదటి దశ వచ్చినప్పుడు ఓటిటిలు ఆదుకున్నాయి. కానీ ఇప్పుడవే చిన్న నిర్మాతలతో ఆడుకుంటున్నాయి. మునుపటిలా దూకుడుగా గుడ్డిగా నమ్మేసి హక్కుల కోసం డబ్బులు కుమ్మరించడం లేదు. ఆచితూచి వ్యవహరించి కంటెంట్ కాంబినేషన్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాయి.
రెండేళ్ల క్రితమే సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోతే ఏదోలా గట్టెక్కుతూ మెల్లగా కుదుటపడుతోంది. కానీ ఒక్కసారి కరోనా భయం మొదలైందా ఆడియన్స్ థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేస్తారు. గవర్నమెంట్ సైతం మొహమాటం లేకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. బూస్టర్ డోస్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వస్తాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి నుంచి విశ్వక్ సేన్ దాకా మోహన్ బాబు నుంచి మహేష్ బాబు దాకా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు ఇబ్బంది లేదు కానీ ఎటొచ్చి షూటింగులు ఆగిపోతే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయి. మరి కరోనా కొత్త వేవ్ నీటిబుడగలా త్వరగా పేలిపోతే సంతోషం. లేదంటే ఊహించుకోవడమూ కష్టమే.



