ఒకప్పుడు మొబైల్ ఫోన్లు లేవు. సోషల్ మీడియా లేదు. ప్రైవేట్ టీవీ ఛానల్స్ కూడా లేవు. ఆ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ అంటే పత్రికలో ప్రకటనలు లేదా వాల్ పోస్టర్లతోనే కానిచ్చేసేవారు.
చిన్న పట్టణాలు, గ్రామాలలో రిక్షా బండికి మైకులు కట్టి, పోస్టర్లు తగిలించి పంప్లెట్స్ పంచుతూ ప్రచారం చేసుకునేవారు. కనీసం టెక్నాలజీ కూడా లేని ఆ రోజుల్లో హీరో హీరోయిన్లు ఏడాదికి కనీసం 6, 8, 12 సినిమాలు చేసేసేవారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ 1972లో ఏకంగా 18 సినిమాలు చేశారు!. ఎలా సాధ్యం?
కనీస సౌకర్యాలు కూడా లేని ఆ రోజుల్లో ఏ భాషలో సినిమాలు తీసినా కనీసం 50, 100 రోజులు ఆడేవి. కొన్ని సినిమాలు ఏకంగా ఒకటి రెండేళ్ళు కూడా ఆడాయి.
ఇప్పుడు సకల సౌకర్యాలు, సోషల్ మీడియా, యూట్యూబ్, అత్యద్భుతమైన టెక్నాలజీ, మల్టీ ఫ్లేక్స్ థియేటర్లు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒక్కో సినిమా తీయడానికి రెండుమూడేళ్ళు పడుతోంది… అని అనే కంటే తీసుకుంటున్నారు అని చెప్పడమే సబబు.
వందల కోట్లు పెట్టి రెండుమూడేళ్ళు కష్టపడి సినిమా తీసినా మళ్ళీ కోట్లు ఖర్చు చేసి ప్రమోషన్స్ తప్పనిసరి. అంత ప్రమోషన్స్ చేసినా సినిమా ఆడుతుందనే గ్యారెంటీ లేదు. ఒకవేళ ఆడినా నెల రోజులలో బాక్సులు సర్దుకొని ఓటీటీలోకి వెళ్ళిపోవాల్సిందే. మరో దారి లేదు.
ఈ నెలరోజుల టైమ్ లిమిట్ భయంతోనే దర్శక నిర్మాతలు, హీరోలు తమ సినిమాలను ఒకేసారి వందల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. టికెట్ ఛార్జీలు పెంచేసుకొని, అదనపు షోలు వేసుకొని పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలని ఆరాట పడుతున్నారు.
అంత డబ్బు ఖర్చుపెట్టి ఏళ్ళ తరబడి అంత కష్టపడి తీసిన సినిమా ఆయుష్షు కేవలం నేలరోజులేనా?ఎందువల్ల? లాభాల సంగతి దేవుడెరుగు పెట్టుబడి తిరిగి వస్తే చాలానుకోవడానికి అర్థం ఏమిటి?
ఈ సినీ ప్రస్థానం చూస్తున్నప్పుడు మన సినిమాలు ఆకాశమంత ఎత్తుకు ఎదిగాయా లేక గత వైభవం సాధించలేక చతికిల పడుతున్నాయా? అనే సందేహం కలుగక మానదు.
కనుక ఏవీ లేని ఆ రోజుల్లో దాదాపు ప్రతీ సినిమా ఎలా హిట్ అయ్యేది?అన్నేసి రోజులు ఎలా ఆడేవి? ఇప్పుడు ఎందుకు ఆడలేకపోతున్నాయి? అని సినీ పరిశ్రమలో ఉన్నవారు ఆలోచించుకుంటే మంచిది.






