అదేదో సామెత చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాటాలేసుకొని పంచుకున్నట్లనిపిస్తుంది.. భూముల వ్యవహారంపై ఆ రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు వింటుంటే.
కేసీఆర్ ఫామ్‌హౌసులో 700 ఎకరాలున్న మాట నిజమా కాదా? అని సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో నిలదీశారు. తక్షణం కేసీఆర్‌కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ ఫామ్‌హౌసులో అనధికారికంగా ఉన్నదెంత?
దానిలో 388 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. నెల రోజులలోగా నిగ్గు తేల్చకపోతే సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులపై చర్యలు తీసుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ఈ ప్రకటన, జారీ చేసిన ఈ ఆదేశాలు సహజంగానే బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టించాయి.
కల్వకుంట్ల కవితకు, ఆమె భర్తకు కలిపి మహబూబ్‌నగర్‌లో మొత్తం 47ఎకరాలున్నాయనే సిఎం రేవంత్ ఆరోపణపై ఆమె సరిగ్గానే స్పందించారు. ఎన్నికల అఫిడవిట్ లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని ట్వీట్ చేశారు.
అయితే ఆమె మరో పది మంది బీఆర్ఎస్ నేతల పేర్లు బయటపెట్టి వారందరి భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అంటే సిఎం రేవంత్ చెప్పినట్లు ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే కాకుండా, పలువురు బీఆర్ఎస్ నేతలు భారీగా భూములు సంపాదించుకున్నారని ఆమె చెపుతున్నారన్న మాట!
సిఎం రేవంత్ ప్రకటన, ఉత్తర్వులపై హరీష్ రావు తీవ్రంగా స్పందింస్తూ “రేవంత్ రెడ్డి సోదరులకు రాష్ట్రంలో రెండు గ్రామాలలోనే 308 ఎకరాలున్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని భూములు నొక్కేశారో త్వరలోనే పూర్తి సాక్ష్యాధారాలతో బయటపెడతాము,” అన్నారు.
కనుక ఇప్పుడు హరీష్ రావు చేస్తున్న ఈ ఆరోపణలపై సిఎం రేవంత్ రెడ్డి కూడా సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఈ పరస్పర ఆరోపణలతో తేలిందేమిటంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు భూములు ఇవ్వకపోగా, నయాన్నో భయాన్నో వారి భూములను ఈ రెండు పార్టీల నేతలే సొంతం చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది కదా?
ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, పాలకులు ఈ స్థాయిలో భూములు మేసేస్తుంటే, ఉన్నతాధికారులు మడి కట్టుకొని కూర్చోరు కదా?
ఇటీవల ఏసీబీ దాడులలో పలువురు అవినీతి అధికారులు వందల కోట్ల ఆస్తులు పోగేసుకున్న విషయం బయటపడింది కదా?
ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇందుకేనా? సుమారు 1500 మంది బలిదానాలు చేసుకుంది ఇందుకేనా?అనిపించకమానదు.
తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్నవారే మళ్ళీ హైదరాబాద్ గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తుండటాన్ని ఏవిధంగా చూడాలి?





