“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా రివ్యూ: ఓకే ఓకే, పాస్

Thimmarajupalli TV Telugu Movie Review

చిత్రం: “తిమ్మరాజుపల్లి టీవీ”

M9 రేటింగ్: 2.25/5

ADVERTISEMENT

విడుదల తేదీ: ఏప్రిల్ 17, 2026

తారాగణం: సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్, కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, తేజ విహాన్ తదితరులు

నిర్మాణ సంస్థ: KA ప్రొడక్షన్స్

దర్శకత్వం: వి.మునిరాజు

సంగీతం: వంశీకాంత్ రేఖన

నిర్మాత: కిరణ్ అబ్బవరామ్

ఛాయాగ్రహణం: అక్షయ్ రామ్ పొదిశెట్టి

కూర్పు: వి.మునిరాజు

కథానాయకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంటూ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి దాదాపు 40 మంది కొత్త టాలెంట్ ను పరిచయం చేసిన చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ”. పల్లెటూరు నేపథ్యంలో టీవీ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా చాలామంది కొత్త నటీనటులు మరియు టెక్నీషియాలు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పటివరకు ప్రమోషనల్ కంటెంట్ తో ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? నిర్మాతగా కిరణ్ తొలి చిత్రంతో హిట్ కొట్టాడా? అనేది చూద్దాం..!!

కథ:

కుప్పం దగ్గరలోని తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో పండగకి టీవీ, క్యాసెట్లు, వీడియో ప్లేయర్ రెంట్ కి తెచ్చుకొని బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జునల సినిమాలు చూడడం ఆనవాయితీ.
తన ఊరికి ఎప్పటికైనా తానే మొదటి టీవీ & డిష్ తీసుకురావాలి అనుకుంటాడు ఊరి పెద్ద రామచంద్రయ్య (అమ్మ రమేష్), అతను అలా కలలు కంటుండగానే టీవీ కొనేసి ఊర్లో తానే గొప్ప అని నిరూపించుకుంటాడు రాజప్ప (ప్రదీప్ కొట్టే).
అప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ఊరంతా రాజప్ప ఇంట్లోనే టీవీ చూస్తూ ఉండిపోతారు. అది తట్టుకోలేక రామచంద్రయ్య కిందా మీదా పడిపోతుంటాడు.
అందరూ ఎంతగానో ప్రేమిస్తున్న టీవీ దొంగతనానికి గురవుతుంది. అప్పటికే ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్న సతీష్ (సాయి తేజ్) అనుకోని విధంగా ఈ టీవీ దొంగతనంలో పాత్రధారి అవుతాడు.
ఇంతకీ టీవీ దొంగతనం చేసింది ఎవరు? సతీష్ ఆ నిందను ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో తిమ్మరాజుపల్లిలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే “తిమ్మరాజుపల్లి టీవీ” కథాంశం.

నటీనటుల పనితీరు:

అమ్మ రమేష్, సత్యనారాయణ లాంటి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు తప్ప మిగతా అందరూ కొత్తవాళ్ళే. అందరిలో నటుడిగా తనదైన స్క్రీన్ ప్రెజన్స్ & నటనతో అలరించింది ప్రదీప్ కొట్టే. స్వతహా స్టేజ్ ఆర్టిస్ట్ అయినా ప్రదీప్ ముఖంలో హావభావాలు చాలా స్పష్టంగా పలికాయి. చాలా ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు.
సాయి తేజ్, వేదా జలంధర్, స్వాతి కరిమిరెడ్డిల నటన చూస్తే ఇది వారి మొదటి సినిమా అని అస్సలు అనిపించదు. ముఖ్యంగా స్వాతి కరిమిరెడ్డి కైమాక్స్ మోనోలాగ్ బాగా చెప్పింది. కాకపోతే.. సినిమాకి చాలా కీలకమైన రాజప్ప కరెంట్ షాక్ సీన్ లో మాత్రం బ్లాంక్ ఫేస్ తో ఉండడం అనేది మైనస్. సిద్ధయ్యగా లతీష్, టీవీ కుమార్ గా తేజ విహాన్, శివమ్మగా ప్రజ్ఞ రెడ్డిలు మంచి నటన కనబరిచారు.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు కమ్ ఎడిటర్ వి.మునిరాజు 90వ దశకంలో పరిస్థితులని, స్థితిగతులను చాలా చక్కగా కథనంలో పొందుపరిచాడు. పెళ్లి సీన్ లో కుర్చీల మీద తమిళ టైటిల్స్, టీవీ డిష్, యాస వంటి విషయంలో చాలా కేర్ తీసుకొని.. అథెంటిసిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. ఫస్టాఫ్ లో ఎస్టాబ్లిష్మెంట్ & ట్విస్ట్ ప్లేస్మెంట్ వరకు బాగుంది కానీ.. సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ ను ప్రొలాంగ్ చేసే క్రమంలో డ్రామాను రసవత్తరంగా రాసుకోలేకపోయాడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగా రాసుకున్నప్పటికీ, దాని ఎగ్జిక్యూషన్ లో కాస్త తడబడ్డాడు. ఓవరాల్ గా.. మొదటి సినిమాకి, తనకి లభించిన పరిమిత వనరులకి డీసెంట్ అవుట్ పుట్ ఇచ్చాడనే చెప్పాలి. డ్రామా ఇంకాస్త బాగా వర్కవుట్ అయ్యుంటే సినిమా మరో స్థాయికి చేరేది. ఎడిటర్ గానూ మంచి మార్కులు సంపాదించుకున్నాడు మునిరాజు, ఇంటర్ కట్స్ బాగున్నాయి.
వంశీకాంత్ సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టు. సందర్భానుసారంగా వచ్చే సరళమైన సంగీతం, అర్థవంతమైన సాహితం, వైవిధ్యమైన జానర్ పాటలు అలరిస్తాయి. ముఖ్యంగా సౌండ్ మిక్సింగ్ & బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేయడంలో కీలకపాత్ర పోషించాయి. సంగీత దర్శకులు తక్కువగా ఉన్న తెలుగు చిత్రసీమకు వంశీకాంత్ లాంటి టెక్నీషియన్ల అవసరం చాలా ఉంది.
అక్షయ్ రామ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. లో లైట్ సీక్వెన్సులు మరియు కలర్ టోన్ విషయంలో తీసుకున్న కేర్ ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది.
కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ టీమ్ లు 90ల టైంలైన్ ను రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

విశ్లేషణ:

పల్లుటూరి నేపథ్యం, అందులోనూ 80 నుండి 90 నడుమ పుట్టినవారి జ్ఞాపకాలను గుర్తుచేసే టీవీ ముఖ్యాంశం. ఇలా అన్నీ ఉన్నప్పటికీ, కట్టిపడేసే డ్రామా సరిగా వర్కవుట్ అవ్వకపోవడంతో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాగా పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది కానీ.. నటీనటుల సహజమైన పెర్ఫార్మెన్సులు, టెక్నీషియన్ల కష్టం, స్పష్టమైన చిత్తూరు యాస వంటివి మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి ఒక కథను నమ్మి, ఇంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం ఈ సినిమాని నిర్మించడం అనేది అభినందనీయం. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఓపెనింగ్స్ పెద్దగా ఉండకపోవచ్చు కానీ.. ఇంకాస్త జాగ్రత్తగా ప్రమోట్ చేస్తే వచ్చేవారం పెద్దగా రిలీజులు ఏమీ లేవు కాబట్టి, మెల్లగా పుంజుకునే అవకాశం ఉంది.

ఓవరాల్ గా.. ఒక హానెస్ట్ అటెంప్ట్, ఓకే ఓకే, పాస్!

M9 రేటింగ్: 2.25/5

ADVERTISEMENT
Latest Stories