మనం ఉపయోగించుకున్నా వృధా చేస్తున్నా కాలం ఎవరి కోసం ఆగదు. కానీ గాలి, నీళ్ళలాగ కాలం కూడా ఫ్రీగా దొరికేదే కదా?దాని కోసం టెన్షన్ దేనికి?
ఓ గంట, ఓ వారం, ఓ నెల పోతే పోయింది… మళ్ళీ వస్తూనే ఉంటాయిగా… అని అనుకోకపోవచ్చు. కానీ చాలా మంది తెలిసో తెలియకో కాలాన్ని వృధా చేస్తూనే ఉంటారు.
కాలం విలువ ఎప్పుడు తెలిసి వస్తుందంటే విద్యార్ధులకు పరీక్షలు దగ్గర పడినప్పుడు. యువత ఉద్యోగాలు సాధించలేకపోతున్నప్పుడు. గృహస్తు కుటుంబ పోషణకు సరిపడా డబ్బు సంపాదించలేకపోతున్నప్పుడు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పుడు!
సమయం ఉన్నప్పుడే వీటన్నిటికీ సిద్ధమైతే ఇటువంటి అగ్ని పరీక్షలు, సమస్యలు సులువుగా అధిగమించవచ్చు కదా? కానీ మనలో చాలా మంది గడిచిపోతున్న కాలం విలువ తెలియక వృధా చేసుకొని, తర్వాత తాపీగా పశ్చాతాపపడుతుంటారు. అలాగే 2025 దొర్లించేశాము… 2026 కూడా దొర్లించేయగలం!
కానీ ఈ ఏడాదిలో ఎంత సమయం సద్వినియోగం చేసుకున్నాము? ఎంత వృధా చేశాము?అని ఒక్కసారి ‘టైమ్ ఆడిటింగ్’ చేసి చూసుకుంటే వృధాగా ఖర్చు చేసిందే ఎక్కువగా ఉంటుంది. అలాగని అందరూ సమయాన్ని వృధా చేస్తారని కాదు కానీ చాలా మంది వృధా చేస్తుంటారు.
కానీ సమయాన్ని నూటికి 200 లేదా 300 శాతం సద్వినియోగం చేసుకున్నవారు కూడా ఉన్నారు. అవును నిజమే!
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి బార్బరా కార్ట్‌లాండ్ ఇందుకు చక్కటి నిదర్శనం. ఆమె ఈ తరం మనిషి కారు. 1901లో జన్మించారు. 1998లో తన 98వ ఏట చనిపోయారు. ఆమె జీవితకాలంలో మొత్తం 723 నవలలు వ్రాశారు!
ఆమె చనిపోయే ముందు అంటే 97 ఏళ్ళ వయసులో చివరి నవల వ్రాశారు! ఆమె చనిపోయేనాటికి వాటిలో 160 నవలలు ప్రచురితం కావాల్సి ఉన్నాయి! వాటన్నిటినీ ప్రచురించడానికే సుమారు 20 ఏళ్ళ సమయం పట్టింది!
ఆమె వ్రాసిన నవలలన్నీ కేవలం ప్రేమ గురించే! ఎంత గొప్ప రచయిత్రి అయినా కేవలం ప్రేమ కధలు లేదా నవలలు మాత్రమే వ్రాస్తుంటే వాటిలో కధాంశం, పాత్రలు, సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.
అలా కాకుండా మహా అయితే ఓ పదో పాతికో వ్రాయగలరేమో?కానీ బార్బరా కార్ట్‌లాండ్ ఏకంగా 723 నవలలు వ్రాశారు!
నవలలు వ్రాయడం గొప్ప కాకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలోకి ఆమె నవలలు అనువాదం అయ్యాయి.
కొన్ని వందల కోట్ల కాపీలు పబ్లిష్ అయ్యాయి! అంటే ఆమె తన రచనలతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులను మెప్పించారనే కదా అర్ధం?
రచయిత్రిగా ఆమె గొప్పదనం గురించి తెలుసుకున్నాము. కానీ అంతకంటే ముఖ్యం సమయాన్ని ఆమె ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకున్నారో తెలుసుకోవడం.
మరే పని చేయకుండా ఇంట్లో కూర్చొన్నా నెలకు రెండు మూడు నవలలు వ్రాయడం అసంభవం. అదీ పెన్నుతో కాగితాల మీద అసలే అసాధ్యం. కానీ బార్బరా కార్ట్‌లాండ్ అలాగే 723 నవలలు వ్రాశారు!
ఆమె జీవితాంతం ఇంట్లో కూర్చొని నవలలు వ్రాయలేదు. బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీ కౌన్సిలర్‌గా 9 ఏళ్ళపాటు రాజకీయాలలో కూడా ఉన్నారు! అంతేకాదు… తన పేరిట “కార్ట్‌లాండ్ ప్రమోషన్స్’ పేరుతో ఓ వ్యాపార సంస్థని స్థాపించి విజయవంతంగా నిర్వహించారు!
క్షణం తీరిక లేని జీవితం గడుపుతూనే ఆమె ఇన్ని వందల నవలలు వ్రాయడం అదీ… ప్రపంచ వ్యాప్తంగా అందరినీ మెప్పించేలా వ్రాయగలిగారు!
కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటో ఆమెను చూసి నేర్చుకోవలసిందే! అందరూ ఆమెలా సెకన్లు, క్షణాలను సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. కానీ గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోలేమా? ఆలోచిస్తే బాగుంటుంది. అందుకు ఇదే సరైన సమయం!







