నవంబర్ 7వ తేదీన టాలీవుడ్ మాటల మాంత్రికుడు పుట్టినరోజు అన్న విషయం అభిమానులకు తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అజ్ఞాతవాసి’తో బ్యాక్ స్టెప్ వేసిన త్రివిక్రమ్, దసరాకు వచ్చిన ‘అరవింద సమేత’తో బౌన్స్ బ్యాక్ అయ్యారని తేలింది. దీంతో త్రివిక్రమ్ తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
[m9ad]
ఈ జాబితాలో ముందుగా ఉన్నదీ అల్లు అర్జున్. వక్కంతం వంశీతో చేసిన “నా పేరు సూర్య” బెడిసికొట్టడంతో, మాటల మాంత్రికుడు కోసం బన్నీ చేసిన నిరీక్షణ ఫలించిందని, దీనిపై ఓ అధికారిక ప్రకటన దీపావళి పర్వదినం కం త్రివిక్రమ్ పుట్టినరోజు అయిన నవంబర్ 7వ తేదీన రానుందనేది లేటెస్ట్ టాక్. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
అలాగే త్రివిక్రమ్ జాబితాలో విక్టరీ వెంకటేష్, అక్కినేని అఖిల్, ప్రిన్స్ మహేష్ బాబు పేర్లు ఉన్నప్పటికీ, మహేష్ సినిమా ఇప్పట్లో లేదని స్పష్టత రావడంతో, వెంకీ సినిమాపై కూడా ఏమైనా ప్రకటన వస్తుందేమోనని ‘గురూజీ’ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పుట్టినరోజు వంటి స్పెషల్ డేలకు త్రివిక్రమ్ నుండి ఎలాంటి స్పెషల్ ప్రకటనలు రావు గానీ, ఈ డేట్ ను పురస్కరించుకుని నిర్మాతలు ఏమైనా తెలియజేస్తారేమో చూడాలి.



