తెలుగులో స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఎంజాయ్ చేస్తున్న స్టేటస్ & క్రెడిబిలిటీ గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఒక్క “అజ్ఞాతవాసి” తప్ప త్రివిక్రమ్ కెరీర్ లో బ్యాడ్ ఫిలిమ్స్ లేవు అనేది అందరూ హీరోల అభిమానులు ముక్తకంఠంతో ఒప్పుకునే విషయం. అటువంటి త్రివిక్రమ్ ఎందుకో పాన్ ఇండియా సినిమాకి మాత్రం ఇప్పటివరకు దూరంగానే ఉన్నాడు. “అల వైకుంఠపురములో” అనంతరం త్రివిక్రమ్ దాదాపుగా దర్శకత్వ పర్యవేక్షణకే పరిమితమైపోయాడు. పవన్ కళ్యాణ్ సినిమాలకి హెల్ప్ చేస్తూ తన కెరీర్ ని పక్కన పెట్టేశాడు.
ఇటీవల వెంకటేష్ తో “ఆదర్శ కుటుంబం” మొదలెట్టిన త్రివిక్రమ్.. ఆ తర్వాత చిత్రం కుమారస్వామి కథ ఆధారంగా “గాడ్ ఆఫ్ వార్” ఉంటుందని వార్తలు వింటూ వస్తున్నాం. మొదట ఎన్టీఆర్ తో మొదలైన ఈ చిత్రం ఆ తర్వాత అల్లు అర్జున్ వైపు మళ్ళింది. మళ్లీ ఏమైందో కానీ.. తిరిగి ఎన్టీఆర్ దగ్గరకే వచ్చింది. ఇవాళ అఫీషియల్ గా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ రెండో చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ విడుదలైన పోస్టర్ లో పెద్దగా ఎలాంటి కంటెంట్ రివీల్ చేయనప్పటికీ.. కాంబినేషన్ క్రేజ్ వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ తొలి పాన్ ఇండియన్ ప్రయోగం కోసం సితార-ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను సిద్ధం చేసుకొంటోంది. ప్రపంచస్థాయిలో గ్రాఫిక్స్ ఉండనున్నాయి. ఆల్రెడీ కొన్ని ఇండియన్ కంపెనీస్ మరియు కొన్ని జపనీస్ సీజీ కంపెనీలతో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాక ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ ఉన్న జపాన్ లోనూ ఏక కాలంలో విడుదల చేయడానికి నాగవంశీ సన్నాహాలు చేసుకుంటుండగా.. హీరోయిన్ కోసం ఒక కొత్త ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు బృందం.
ఈ సరంజామా అంతా పక్కన పెడితే.. త్రివిక్రమ్ కి ఆల్రెడీ తమిళ, మలయాళ, హిందీ మార్కెట్స్ లో మంచి క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో పాపులర్ అయిన “అత్తారింటికి దారేది, జులాయి” వంటి సినిమాలు పలు భాషల్లో రీమేక్ అవ్వడమే కాక, డబ్బింగ్ రూపంలోనూ మంచి ఆదరణ చూరగొన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ పంచులకి, సీన్ కంపోజిషన్స్ కి వేరే మార్కెట్స్ లోనూ క్రేజ్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. త్రివిక్రమ్ పాన్ ఇండియన్ డెబ్యూ ఎప్పుడో జరగాలి. కానీ.. కాస్త లేట్ గా వచ్చే ఏడాది మొదలుకానుంది. విడుదల మాత్రం 2029కే సాధ్యం. మరి “గాడ్ ఆఫ్ వార్”తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయే త్రివిక్రమ్, తర్వాత మిగతా పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లా రీజనల్ సినిమాలు చేయడం ఆపేసి, కేవలం పాన్ ఇండియన్ సినిమాలే తీస్తాడా? లేక బ్యాలెన్స్ చేస్తాడా? అనేది చూడాలి.




