మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్ పర్సన్ పదవులన్నీ కలిపి మొత్తం 87 కాగా వాటిలో విజయవాడతో సహా 74 పదవులకు సోమవారం ప్రమాణ స్వీకారాలు జరిగాయి. మిగిలిన 13 డిప్యూటీ పదవులకు నేడు ఎన్నికలు నిర్వహించి ప్రమాణ స్వీకారాలు నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి 57, జనసేనకు 19, బిజేపికి 8 పదవులు లభించాయి. ఈ ఎన్నికల్లో టీడీపి మెజార్టీ స్థానాలు గెలుచుకుంది కనుక అదే నిష్పత్తిలో అది పదవులు తీసుకోవడం సబబే. అలాగే తొలిసారిగా అధికారంలోకి వచ్చిన జనసేనకు ఇన్ని పదవులు దక్కడం కూడా అభినందనీయమే.
అయితే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్ల విషయంలోనే జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జెడ్పీలు, పురపాలక సంఘాలలో డిప్యూటీ చైర్ పర్సన్, కార్పోరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో కూడా మరోసారి తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
కొన్నిచోట్ల టీడీపీ వలన, మరికొన్ని చోట్ల సొంత పార్టీ వల్లనే తమకు అన్యాయం జరిగిందని ఈ పదవులు ఆశించిన జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదాహరణకు విజయనగరం కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి జనసేనకు చెందిన గురాన రాధిక పేరు ఖరారు చేసి ఆమెకు బీఫారం కూడా ఇచ్చారు. కానీ సోమవారం ఉదయానికల్లా ఆమె స్థానంలో టీడీపికి చెందిన ప్రసాదుల రజనీకి బీ ఫారం ఇవ్వడంతో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు నిరసనగా గురాన రాధిక ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మీడియా సమావేశంలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం వైస్ చైర్ పర్సన్ పదవి విషయంలో చాలా రభస జరిగింది. ఈ పదవిని జనసేనకు చెందిన కొలగాని శిరీషకు కేటాయించగా, ఆమె స్థానంలో జనసేనకే చెందిన కత్తి పద్మజను ఎన్నుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒత్తిడితోనే కౌన్సిలర్లు తనను కాదని ఆమెను ఎన్నుకున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె, మరో ఇద్దరు జనసేన కౌన్సిలర్లు, తన అనుచరులతో కలిసి కార్యాలయం బయట ధర్నా చేశారు. దీంతో నిన్న జరిగిన డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ నేడు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
విశాఖ మేయర్‌గా ఎన్నికైన శ్రావణి తండ్రి ఇటీవల చనిపోయినందున ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ జనసేనకు చెందిన పీవీఎస్ ప్రసాద్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవడంతో ఆయనతో పాటు మిగిలిన 119 కార్పొరేటర్లు కూడా నిన్న ప్రమాణ స్వీకారాలు చేశారు.
అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ అద్దేపల్లి సౌజన్యను ఎంపిక చేయగా, టీడీపి ఒత్తిడితో పీవీఎస్ ప్రసాద్‌కు కట్టబెట్టారంటూ సోషల్ మీడియాలో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చివరికి ఎంపీపీ పదవుల్లో కూడా తమకు తీరని అన్యాయం జరిగిందని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఒక్కటే ఎల్లప్పుడూ మిత్ర ధర్మం పాటించాలా? టీడీపి పాటించదా? జనసేనలో కూడా కొందరు మోసపూరితంగా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు మీడియా సమావేశాలు నిర్వహించి తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళ గ్రక్కుతున్నారు.
ఇలాంటి సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలలో పదవులు దక్కని వారు ఈవిధంగా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేయడం పరిపాటే.
కానీ జనసేన విషయానికి వస్తే, అది తొలిసారిగా అధికారంలో వచ్చింది కనుక పార్టీ శ్రేణులను బుజ్జగించడం చాలా అవసరం. వారికి సముచిత పదవులు దక్కేలా చేయాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపైనే ఉంది. లేకుంటే వారు పార్టీ అధిష్టానంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.





