మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వర్గాలకు మరో షాకిచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణారెడ్డి మరణంతో ఏర్పడిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సానుభూతితో ఓట్లు రాలతాయనుకున్న కాంగ్రెస్ వర్గాలకు ఓదార్పుగా ఈ సారి డిపాజిట్లు దక్కాయి.
టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన భూపాల్ రెడ్డి 53,625 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి సంజీవరెడ్డిపై గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్ కు 93,076 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39,451 ఓట్లు పోలయ్యాయి. ఇక, మూడవ స్థానంలో ఉన్న టిడిపికి కేవలం 14,787 ఓట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది.
మెదక్ జిల్లాలోని ఈ గెలుపుతో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వర్గం సంతోషంగా ఉరకలేస్తోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేసీఆర్ కు గ్రేటర్ పీఠాన్ని సమర్పించి కేటీఆర్ వర్గం పండగ చేసుకోగా, తాజాగా హరీష్ రావు వంతు వచ్చినట్లయింది. నిజానికి ఈ ఎన్నికల ఫలితం ముందుగా అంచనా వేసినదే కావడంతో రాజకీయ పరంగా పెద్దగా ప్రభావం చూపడం లేదు.



