ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చి యావత్ ప్రపంచదేశాలను, వాటి ఆర్ధిక వ్యవస్థలను, మార్కెట్లను, ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. అలాంటి గొప్ప ట్రంప్ గురించి ఈ ఏడాది ముగింపులో నాలుగు ముక్కలు చెప్పుకోకపోతే ఆయనని కించపరిచినట్లే!
ట్రంప్ ఏడో ఎనిమిదో యుద్ధాలు ఆపేసి లక్షలమంది ప్రాణాలు కాపాడానని చెప్పుకున్నారు. కనుక నోబుల్ శాంతి బహుమతి ఆశించారు కానీ రాలేదు. అందుకు వేరే కారణం ఉండొచ్చు.
రష్యా-ఉక్రెయిన్ మద్య జస్ట్ పది రోజుల్లో ఆపేయగలనని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ 2026లో తప్పకుండా ఉక్రెయిన్‌పై విజయం సాధిస్తామని ఇటీవలే చెప్పారు. అంటే మరో ఏడాదిలో కూడా యుద్ధం కొనసాగించబోతున్నారన్న మాట!
యుద్ధాలు ఆపి మనుషుల ప్రాణాలు కాపాడటం అంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ చెప్పుకున్నారు. కానీ వారం రోజుల క్రితమే అమెరికన్ యుద్ధ విమానాలు సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఎందుకు? శాంతి స్థాపన కోసమే!
కనుక అప్పుడప్పుడు ఇలా శాంతి స్థాపన కోసం అమెరికా యుద్ధాలు చేయకతప్పదని స్పష్టమైంది. కొన్నిసార్లు బాంబులు, క్షిపణులతో యుద్ధం చేయవచ్చు. కొన్నిసార్లు సుంకాలతో చేయాల్సిరావచ్చు. కొన్నిసార్లు హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డులు, గోల్డెన్ కార్డులతో కూడా ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధాలు చేయాల్సి రావచ్చు.
అలాగే ఇతర దేశాలు యుద్ధాలు చేసుకోవడానికి అత్యాధునిక యుద్ధ విమానాలు, ఆయుధాలు కూడా ఆయనే సరఫరా చేస్తుంటారు. భారత్-పాక్ యుద్ధం ఆపించేసిన ట్రంప్, భారత్‌కి సుమారు రూ.800 కోట్ల విలువగళ ఆయుధాలు అమ్మకానికి ఒప్పందం చేసుకోవడమే చక్కటి ఉదాహరణ. ఆ ఆయుధాలు ఎవరిపై ప్రయోగించడానికి?
కనుక యుద్ధాలు చేయించేది ఆయనే… అవి యుద్ధం చేసుకుంటుంటే ఆపేది ఆయనేనన్న మాట!
ట్రంప్ యుద్ధాలు-శాంతి-ఆయుధాల వ్యాపారం అన్నీ కలగాపులగం చేసేస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ వాటన్నిటి వెనుక ఓ గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడు. ఆ వ్యాపారి లక్ష్యం శాంతి స్థాపన అంటే నమ్మశక్యంగా ఉందా?







