
నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్-4 ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఈసారి కూడా మొదటి ఎపిసోడ్‌కి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అతిధిగా వచ్చారు. వారిద్దరూ పాల్గొన్న మొదటి ఎపిసోడ్ ప్రమో కూడా విడుదలైంది.
సీజన్-3 మొదటి ఎపిసోడ్‌లో మాదిరిగానే ఈసారి కూడా ఇద్దరూ కలిసి ఆద్యంతం షోని చాలా రక్తి కట్టించిన్నట్లు ప్రమో చూస్తే అర్దమవుతోంది.
“ఆనాడు జగన్ ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది. జైలు జీవితం ఎలా గడిచింది?” అని ప్రశ్నించి ఇంతవరకు ఎవరికీ తెలియని ఆ విషయం గురించి చంద్రబాబు నాయుడు నోటే చెప్పించారు.
తనను ఓ చీకటి గదిలో బందించి తలుపులు వేసేశారని, తాను ఎంతగా తలుపు కొట్టి పిలుస్తున్నా ఎవరూ పలికేవారు కారని, జైలులో 53 రోజులు ఇంచుమించు అలాగే గడిచిందని చెప్పిన్నప్పుడు ప్రేక్షకులు కంట తడిపెట్టారు. కానీ తాను చాలా గుండె నిబ్బరంతో ఆ వేధింపులని తట్టుకున్నానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆ తర్వాత జైలులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఆ వివరాలు ఎపిసోడ్ ప్రసారం అయినప్పుడు తెలుస్తాయి.
సీరియస్ ప్రశ్నలు అడిగి వాతావరణం గంభీరంగా మారగానే, “మీ ఇంట్లో మా ముద్దుల చెల్లి భువనేశ్వరి పెత్తనం చేస్తారా లేదా మీ కోడలు బ్రాహ్మణి (బాలకృష్ణ కుమార్తె) పెత్తనం చేస్తుందా?” అని బాలకృష్ణ అడిగేసరికి అందరూ గొల్లుమని నవ్వారు.
దానికి సిఎం చంద్రబాబు నాయుడు కూడా అంతే లౌక్యంగా జవాబిస్తూ, “ఇప్పుడు మా ఇంట్లో ఇదే పెద్ద సమస్య అయిపోయింది,” అంటూ జవాబు చెప్పేసరికి మళ్ళీ అందరూ హాయిగా నవ్వుకున్నారు.
మద్యలో ఐటి కంపెనీల గురించి ప్రశ్నిస్తే, “ఇదివరకు నేను థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనేవాడిని కానీ ఇప్పుడు థింక్ అండ్ యాక్ట్ గ్లోబల్లీ” అని అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడేస్థాయికి తీసుకుపోవాలనేదే నా లక్ష్యం,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన జవాబుకి ప్రేక్షకులు ముగ్దులై చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు.
ఇలాంటి గంభీరమైన ప్రశ్నలు, చిలిపి ప్రశ్నలతో నందమూరి బాలకృష్ణ తన బావగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆటపట్టిస్తుంటే ఆయన కూడా సమయస్పూర్తితో సమాధానాలు చెపుతుంటే ఇద్దరూ అన్ స్టాపబుల్ అని అనిపించకమానదు.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…