ఒక్కోసారి కొన్ని విషయాలు కబుర్లుగా మిగిలిపోతేనే బెటర్. వాటిని ఇంటర్వ్యూల్లో ప్రస్తావించి, స్టెట్మెంట్లుగా రికార్డ్ అయ్యాయి అంటే.. అవి ఎంత దూరం వెళ్తాయి అనేది ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం వి.వి.వినాయక్ ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నపాటి దుమారం రేపుతుంది.
ఆది సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ పొలిటీషియన్ పరిటాల రవి తన తండ్రి పరిటాల శ్రీరాములు జీవితాన్ని సినిమాగా తీద్దామని అనుకున్నాడు. పరిటాల శ్రీరాములుగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే సినిమాకి మంచి స్థాయి వస్తుందని పరిటాల రవి ఆకాంక్ష.
ఆ కాంబినేషన్ సెట్ చేయాల్సిందిగా కొడాలి నానిని రిక్వెస్ట్ చేశాడట పరిటాల రవి. ఎందుకో నాని అంగీకరించలేదు. ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేసేద్దాంలే అనేశాడట. కానీ.. నాని మాత్రం వద్దంటే వద్దు అని మొండిగా కూర్చున్నాడట. దాంతో పరిటాల రవి ఏకంగా నానిని చంపేస్తామని బెదిరింపులు కూడా పంపాడట.
అయినా.. నాని మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో.. తర్వాత ఆ ప్రాజెక్ట్ ను మోహన్ బాబు హీరోగా, ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందనుకోండి. కాకపోతే.. సినిమాలో నక్సలైట్ గా హరికృష్ణ స్పెషల్ రోల్ & వందేమాతరం శ్రీనివాస్ పాటలు మాత్రం జనాలకి గుర్తుండిపోయాయి.
దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆ టాపిక్ ను మళ్లీ తీసుకొచ్చి లేనిపోని డిస్కషన్స్ కి దారి తీసేలా చేస్తున్నాడు వినాయక్. ఆయన అలా వైరల్ అవ్వాలి అనుకోకపోయినా.. అనవసరంగా పరిటాల గ్యాంగ్ ను కెలుకుతున్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు.
వినాయక్ కి ఈ స్టేట్మెంట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదు కానీ.. సినిమాలు తీయడం ఆపేసి గ్రేస్ ఫుల్ గా అగ్ర దర్శకుడు స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న వినాయక్ స్టార్ డం కి మాత్రం ఇది అనవసరమైన రచ్చ.




