కొడాలి నానితో వంగవీటి దోస్తీ టిడిపికి ఇబ్బందే!

vangaveeti-radha-kodali-nani-meet-in-gudivadaమాజీ మంత్రి కొడాలి నానిని టిడిపి నేత వంగవీటి రాధ గుడివాడలో వైసీపీ నేత వివాహంలో కలుసుకొన్నారు. విజయవాడ నుంచి గుడివాడ వచ్చిన వంగవీటి రాధని కొడాలి నాని ఎదురేగి ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారి మరో స్నేహితుడు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వంగవీటి రాధ, వారిద్దరి పార్టీలు వేరైనా వారి మద్య నేటికీ బలమైన స్నేహం కొనసాగుతూనే ఉంది. వైసీపీ, టిడిపిల మద్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలుసు. కానీ వైసీపీలోని ఆ ఇద్దరు నేతలు టిడిపికి చెందిన వంగవీటి రాధని పల్లెత్తుమాట అనరు. ఆయన మీద ఈగ వాలనీయరు. వారి ముగ్గురి మద్య అంత బలమైన స్నేహం ఉన్నందునే వంగవీటి రాధకి కూడా నచ్చజెప్పి వైసీపీలోకి రప్పించుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ రాధ మాత్రం టిడిపిని విడిచిపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.

కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ని నిత్యం బూతులు తిడుతుండే కొడాలి నానితో వంగవీటి రాధ రాసుకుపూసుకు తిరుగుతుండటం టిడిపికి, ముఖ్యంగా కృష్ణా జిల్లా టిడిపి నేతలకి చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ జిల్లా రాజకీయాలలో వంగవీటి కుటుంబానికి మంచి పట్టు ఉన్నందున ఎవరూ అభ్యంతరం చెప్పలేకపోతున్నారు.

ADVERTISEMENT

వచ్చే ఎన్నికలలో గుడివాడలో కొడాలి నానిని ఎట్టి పరిస్థితులలో ఓడించాలని టిడిపి చాలా పట్టుదలగా ఉంది. కనుక గుడివాడ నుంచి కొడాలి స్నేహితుడు వంగవీటి రాధనే బరిలో దింపితే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇద్దరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది కనుక స్నేహితుడిపై పోటీ చేయడానికి వంగవీటి అంగీకరిస్తారా లేదో తెలీదు. కానీ అంగీకరిస్తే అప్పుడు ఇద్దరూ స్నేహం ముఖ్యమా… లేదా పార్టీలు, పదవులు ముఖ్యమా అని తేల్చుకోకతప్పదు. పార్టీలు, పదవులే ముఖ్యమని భావిస్తే వచ్చే ఎన్నికలలో గుడివాడలో చాలా పసందైన పోటీ ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories