“కంచె” సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు క్రిష్ “నలుగురితో నారాయణ” అన్న చందం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఎంచుకుని ఆ బాటలోనే విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ‘కంచె’ సినిమా దర్శకుడిగా తనకే కాక వరుణ్ ను హీరోగా నిలబడడానికి ఎంతో ఉపయోగపడింది.
ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్ళీ క్రిష్ – వరుణ్ లు కలిసి మరో సినిమాకు శ్రీకారం చుట్టాలని భావించారు. ఆ సినిమాకు “రాయబారి’’ అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. అయితే ఆ సినిమా కథ ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉందట! విదేశాల్లో షూటింగ్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని.
మరోవైపు వరుణ్ మార్కెట్ చూస్తే మొదటి సినిమా “ముకుంద” అంచనాలు అందుకోలేక పోయింది. రెండవ సినిమా “కంచె” ఒక మంచి సినిమాగా అందరి చేత ప్రశంసలు రాబట్టగలిగింది కానీ, కలెక్షన్ల వర్షం కురిపించలేక పోయింది. ఇక తరువాత వచ్చిన “లోఫర్” వరుణ్ తేజ్ మార్కెట్ ను ప్రభావితం చేయలేకపోయింది. మొత్తమ్మీద వరుణ్ మార్కెట్ దాదాపు 12 కోట్ల వరకే పరిమితమైంది.
అయితే క్రిష్ తానూ అనుకున్న “రాయబారి” తెరకెక్కించాలి అంటే దాదాపు సినిమా బడ్జెట్ 20 కోట్లు అవుతుందని, అంత బడ్జెట్ వరుణ్ మీద వర్కౌట్ కాదు కాబట్టి తాత్కాలికంగా ఈ సినిమాకు బ్రేక్ వేసారని టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సమాచారం. బడ్జెట్ కి రాజీపడి ఆ ‘రాయభారం’ మోయలేనని దర్శకులు క్రిష్ స్పష్టంగా చెప్పడంతోనే ఈ సినిమా పట్టాలెక్కడం లేదన్న మాట!



