ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా వెంకీ మామ చిత్రబృందం ఒక చిన్న టీజర్ విడుదల చేసింది. టీజర్ మొదటి భాగంలో వెంకటేష్ నాగచైతన్య మధ్య ముచ్చట్లు చూపించాడు దర్శకుడు. వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పాలి. అలాగే తరువాతి భాగంలో చైతన్యను ఆర్మీ ఆఫీసర్ కార్తీక్ శివరామ్ గా చూపించారు.
ఈ రకంగా చిన్న టీజర్ లో కామెడీ, యాక్షన్ రెండిటినీ బ్యాలన్స్ చేసే ప్రయత్నం చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. అయితే ఈ టీజర్ లో కూడా చిత్రబృందం తన రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం విశేషం. డిసెంబర్ 13న సినిమా విడుదల దాదాపుగా కంఫర్మ్ అయిపోయింది అంటున్నారు.
వెంకటేష్, చైతన్యలకు ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా సంక్రాంతికి విడుదల చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు అయితే జరగడం లేదు. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు.
తమన్ బాణీలు అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన చివరి పాట రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. నిర్మాణానంతర పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఈరోజు చైతన్య – శేఖర్ కమ్ముల చిత్రబృందం కూడా హీరోకి సంబంధించిన చిన్న వీడియో విడుదల చేశారు. అది కూడా బావుండడంతో చైతన్యకు ఇది నిజంగానే హ్యాపీ బర్త్ డే అని చెప్పుకోవాలి.



