సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1వ తేదీకి మార్చింది. అవసరమైతే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించి, 3న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది.
ముఖ్యంగా తీవ్రంగా అల్లర్లు జరిగిన తిరుపతి, కడప కార్పోరేషన్లోని పలు డివిజన్లతో బాటు రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీలలో పలు వార్డులలో మళ్ళీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 23, 24వ తేదీల్లో నామినేషన్స్ స్వీకరణ, 25న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తుంది. ఈసారి కలెక్టర్ కార్యాలయాలలో కూడా అభ్యర్ధులు నామినేషన్స్ దాఖలు చేయవచ్చని తెలిపింది.
“ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదు.. అల్లర్లు తప్పవని” వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే చాలా స్పష్టంగా చెప్పారు. అయినా వైసీపీ వ్యూహాలను పసిగట్టి అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కనుకనే ఇటువంటి మార్పులు జరిగాయి.
ఈ అల్లర్లు, విధ్వంసం వల్ల వైసీపీకి కొత్తగా కలిగే నష్టం, అప్రదిష్ట ఏమీ ఉండబోదు. కానీ వీటితో కూటమి ప్రభుత్వానికి అంటిన మరకలు తుడిచేసుకోవడం అంత సులభం కాదు. ఈ అల్లర్లు, విధ్వంసం గురించి జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మొదట టీడీపీ-జనసేనల మధ్య సీట్ల సర్దుబాట్లు, ఆ తర్వాత బీఫారంల పంపిణీ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరిగిన రాద్ధాంతంతో టీడీపి ప్రతిష్ట చాలా దెబ్బ తింది.
ఆ తర్వాత ఈ ఎన్నికలలో వైసీపీ నామినేషన్స్ వేయకపోయినా కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దారుణంగా దెబ్బ తీయగలిగింది. కనుక ఇప్పటికే అది సగం విజయం సాధించినట్లే.
కనుక ఇప్పుడు మరో కొత్త వ్యూహంతో వచ్చి కూటమి ప్రతిష్టని మరోసారి దెబ్బ తీసేందుకు ప్రయత్నించవచ్చు. అప్పుడు వైసీపీ ఈ ఎన్నికలలో ఓడినా రాజకీయంగా అదే విజయం, పైచేయి సాధించినట్లవుతుందని కూటమి ప్రభుత్వం గ్రహిస్తే మంచిది.





