ఆటుపోట్లు ఎవరికైనా సహజం. ముఖ్యంగా డిజాస్టర్లు చూడని హీరో ఇండస్ట్రీలో లేడు. అల్లూరి సీతారామరాజు బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 14 ఫ్లాపులు చూశారు. అయినా తట్టుకుని స్వంతంగా సినిమాలు తీసుకుంటూ పాడిపంటలుతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాధ కవిసార్వభౌమ దారుణంగా దెబ్బ తింటే మేజర్ చంద్రకాంత్ ఆయన కమర్షియల్ స్టామినాని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. కుర్ర హీరోలు దూసుకుపోతున్న టైంలో తాను వెనుకబడుతున్నానని భయపడకుండా ఏఎన్ఆర్ తన యాభై ఏళ్ళ వయసులో ప్రేమాభిషేకం చేస్తే అదో చరిత్ర అయ్యింది.
ఆ తరమే కాదు చిరంజీవికి హిట్లర్ కు ముందు, బాలకృష్ణకు సింహాకు ముందు ఇలాంటి స్లంప్ వచ్చింది. నాగార్జున శివ తర్వాత ఎన్నిదెబ్బలు తిన్నారో లెక్క లేదు. కుర్ర హీరోలూ దీనికి మినహాయింపు కాదు. రాజ్ తరుణ్ వీటిని తట్టుకోలేకే వెబ్ సిరీస్ కు వచ్చాడు. నితిన్ ఒక హిట్టు మూడు ఫ్లాపులతో ప్రతిసారి శల్యపరీక్ష చేసుకుంటూనే ఉన్నాడు. విషయానికి వస్తే విజయ్ దేవరకొండ మీద లైగర్ దెబ్బ కేవలం సినిమా కోణంలోనే పడి ఉంటే ఏ సమస్యా లేదు. ఎందుకంటే ఇంతకన్నా ఘోరమైన సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి వస్తాయి కూడా. అందుకే అతను నిరాశ చెందకుండా చేయబోయే ఖుషి మీద కాన్ఫిడెన్స్ తో ఇవన్నీ చల్తా అనే ధోరణిలో ఉన్నాడు.
కానీ ఫెమా చట్టం కింద ఈడి సుమారు పదకొండు గంటలకు పైగా ప్రశ్నించడం అనేది అంత సులభంగా జీర్ణించుకునేది కాదు. ఎందుకంటే విజయ్ లైగర్ కు నిర్మాత కాదు. పెట్టుబడి పెట్టాడో లేదో తెలియదు కానీ టైటిల్ కార్డులో ఉన్న పేర్లనే ప్రొడ్యూసర్లుగా పరిగణిస్తారు కాబట్టి అది తనకు వర్తించదు. అలాంటప్పుడు లైగర్ ఇన్వెస్ట్ మెంట్లకు ఏ కోణంలో అయినా విజయ్ దేవరకొండ ఎలా బాద్యుడవుతాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. వరసగా ఫ్లాపులు పడుతున్నా మార్కెట్ మరీ దారుణంగా పడిపోలేదు. తనను నమ్మే బయ్యర్లు నిర్మాతలు ఇంకా చాలా ఉన్నారు. అందుకే అంత నిబ్బరంగా కనిపిస్తాడు.
ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో అపరిచితుల ముందు అదీ ప్రభుత్వ సాధికారత ఉన్న అధికారుల గుప్పిస్తున్న ప్రశ్నల వర్షాన్ని తట్టుకోవడం యాక్షన్ కెమెరా చెప్పుకున్నంత సులభం కాదు. విజయ్ దేవరకొండది ఎలాంటి తప్పు ఉండకపోవచ్చు. అది రుజువు కావడానికి టైం పడుతుంది. కానీ దానివల్ల కలిగే మానసిక ఒత్తిడిని తట్టుకోవడం సులభం కాదు. సంజయ్ దత్, సుమన్ లాంటి వాళ్ళు ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు చూశారు. కానీ నిలిచి గెలిచారు. విజయ్ దేవరకొండ దీన్ని దాటుకోగలడు. కానీ తన సమాంతర స్టార్లలో ఎవరికీ రాని కఠిన పరీక్ష ఎదురయ్యింది కాబట్టి లైగర్ బాక్సింగ్ రింగ్ లోనే కాదు ఇక్కడా గెలిచి చూపించాలి.



