ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ టైంలో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా ఎబ్యూజ్ చేస్తున్నామని చెప్పి మరీ.. తెలుగులో తప్ప అన్నీ భాషల్లోనూ సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశాడు. ఆఖరికి రేపు రిలీజ్ అనగా కూడా ముంబై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాడు. మరి నాని ఇంత చేస్తే.. తెలుగు కాకుండా మిగతా భాషల నుండి ఆ స్థాయి రెస్పాన్స్ ఉందా అనేది ఆయనకే తెలియాలి. ఇదివరకు పెద్ది టీమ్ కూడా అలాగే నార్త్ లో తెగ ప్రమోట్ చేసారు, కట్ చేస్తే కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. అక్టోబర్ 16న సినిమా రిలీజ్, అక్టోబర్ 15 నుండి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కి సరిగ్గా 10 రోజులు ఉంది. అయితే.. విజయ్ దేవరకొండ & టీమ్ మాత్రం తెలుగులో తప్ప అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. హిందీ, తమిళం భాషల పాపులర్ పాడ్ కాస్టర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలకి వ్యూస్ కూడా మిలియన్స్ లో వచ్చాయి. సంతోషమే కానీ.. ఆ ఇంటర్వ్యూలో ఉన్న కంటెంట్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న.
హిందీ ఇంటర్వ్యూ చేసిన శుభాంకర్ కానీ, తమిళ ఇంటర్వ్యూలు చేసిన సుధీర్ & కీర్తికలు సినిమా గురించి మాట్లాడింది తక్కువ.. విజయ్ & రష్మికల లవ్ స్టోరీ గురించి మాట్లాడింది ఎక్కువ. దాదాపుగా గంటకుపైగా ఉన్న ఈ మూడు ప్యాడ్ క్యాస్టుల నుండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కంటెంట్ ఏంటి? అది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అసలు సినిమా గురించి ఎవరేం చెప్పారు? అనేది గమనిస్తే అర్థమైపోతుంది.
రణబాలి ప్యాన్ ఇండియా సినిమా అనే ఒప్పుకుందాం, కానీ సినిమాకి మేజర్ కలెక్షన్స్ వచ్చేది ఎక్కడి నుండి అనేది కూడా టీమ్ ఆలోచించుకోవాలి కదా. ఏదో తెలుగులో ఇంటర్వ్యూలు ఇస్తేనే ప్రమోట్ చేసినట్లు అని కాదు కానీ, ప్యాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ కోసం పెట్టే టైమ్ & ఎఫర్ట్స్ ఎంతవరకు ప్రాఫిటబుల్ గా ఉంటున్నాయి అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పటికైనా రణబాలి టీమ్ తెలుగు ప్రమోషన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి, హైప్ పెంచే కంటెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది.





