
ఏపీలో పోగొట్టుకున్న ఉంగరం కోసం తెలంగాణలో వెతుక్కుంటున్న వైఎస్ షర్మిలకు అక్కడ దొరకలేదు కానీ మళ్ళీ ఏపీలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి రూపంలో దొరికింది.
ఆమె ముందు రెండు సవాళ్ళు ఉండేవి. 1. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయిన నేతలందరినీ ఆకర్షించి, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్జీవంగా మారిన కాంగ్రెస్ పార్టీకి పునః ప్రాణ ప్రతిష్ట చేయడం. 2. తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం.
కానీ ఆమె మొదటి పనే పూర్తి చేయలేకపోయారు. కనుక 2024 ఎన్నికలలో ఆమెతో సహా పోటీ చేసినవారందరూ ఓడిపోయారు.
తద్వారా రెండు విషయాలు స్పష్టమయ్యాయి. 1. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించడం ఎవరి వల్లా కాదు. 2. వైసీపీ నేతలు, కార్యకర్తలు, 39.38 శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డిపైనే ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. కనుక అప్పటి నుంచి రాష్ట్రంలో షర్మిలను పట్టించుకునేవారే లేకుండా పోయారు.
ఇలాంటి పరిస్థితిలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీతో బరిలో దిగుతున్నారు.
చిరంజీవి తర్వాత జనసేనతో వచ్చి పవన్ కళ్యాణ్ సక్సస్ అయినట్లు, షర్మిల తర్వాత వచ్చిన విజయసాయి రెడ్డి కూడా సక్సస్ అవుతారా? అంటే ఇప్పుడే అవునని కానీ, కాదని గానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది.
కానీ షర్మిలతో పోలిస్తే విజయసాయి రెడ్డి సక్సస్ రేటు ఎక్కువే ఉంటుందని చెప్పవచ్చు. ఇందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
· రాజకీయాలలో పురుషుల సక్సస్ రేటు ఎక్కువ.
· విజయసాయి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. కనుక ఆయన చెప్పిన ‘ఒరిజినల్ రెడ్లు’ అయన వైపు వచ్చే అవకాశం ఉంది.
· జగన్‌తో పోలిస్తే విజయసాయి వ్యవహారశైలి, మాట తీరు, రాజకీయ ఆలోచన తీరు మెరుగుగా ఉంటాయి. కనుక ఇంతవరకు గత్యంతరం లేక జగన్‌తో వేగుతున్నవారందరూ విజయసాయి పంచన చేరవచ్చు.
· ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంటే, జగన్ వైసీపీని నడిపిస్తున్న తీరు, రాజధాని, అభివృద్ధి తదితర అంశాలపై అయన వైఖరి వలన వచ్చే ఎన్నికలలో మరోసారి ఘోర పరాజయం తప్పదని, లోలోన ఆందోళన చెందుతున్నవారికి విజయసాయి రెడ్డి చక్కటి ప్రత్యామ్నాయమే.
· జగన్‌తో పాటు వైసీపీలో పలువురు ముఖ్యనేతల బలాలు, బలహీనతలు, అవసరాలు విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. ముఖ్య నేతల సమస్యలు, అవసరాలు తీర్చగల ఆర్ధిక స్తోమత, రాజకీయ పరపతి రెండూ ఆయనకున్నాయి. కనుక వైసీపీతో పాటు రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులు, అసంతృప్త నేతలు అందరూ ఆయన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపవచ్చు.
· కొత్త పార్టీ కనుక టికెట్లు, సీట్లకు, పార్టీ పదవులకు కొరత, పోటీ ఉండదు.
· ‘నా పార్టీలో నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కాను,’ అంటూ విజయసాయి ముందే పెద్ద బిస్కట్ వేశారు. అలాగే మా ముఖ్యమంత్రి అభ్యర్ధి వేరే కులంవారు కావచ్చు అంటూ మరో బిస్కట్ కూడా వేశారు. కనుక దానికి ఆశపడేవారు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు.
· ముందుగా రాయలసీమలోని రెడ్డి నేతలను, వారి అనుచరులను ఆకట్టుకోగలిగితే, ఆ తర్వాత రెడ్డి సామాజిక ఓటర్లు కూడా అయన వైపే మొగ్గు చూపవచ్చు.
· రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెప్పుకున్న విజయసాయి రెడ్డి అకస్మాత్తుగా తిరిగిరావడం వెనుక బలమైన కారణం, బలమైన అదృశ్యశక్తి తప్పక ఉంటుంది. రాజకీయాలలో ఉన్నవారికి ఆ కారణం, ఆ అదృశ్యశక్తిని గుర్తించగల నేర్పు ఉంటుంది. కనుక ‘అది చాలా పవర్ ఫుల్’ అని భావిస్తే విజయసాయి రెడ్డి పార్టీలోకి జంప్ చేయడానికి క్షణం ఆలోచించరు.
కనుక ఇక నుంచి విజయసాయి రెడ్డి వేసే ప్రతీ అడుగు వైసీపీకి ప్రమాదకరంగానే మారవచ్చు. టీడీపికి, కూటమి పార్టీలకు ప్రమాదం కాదా? అనే సందేహానికి జవాబు మరోసారి చెప్పుకుందాం.
విజయసాయి రెడ్డికి జగన్ గురించి ఎంతబాగా తెలుసో జగన్మోహన్ రెడ్డికి కూడా అయన గురించి అంతే బాగా తెలుసు. కనుక ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో… దసరా నుంచి న్యూఇయర్‌లోగా కొంత స్పష్టత వస్తుంది.
Lust Stories 3 is just out on Netflix and getting several responses from viewers. But…
Shah Rukh Khan, Ajay Devgn, and Tiger Shroff have been involved in controversy for promoting…