విజయసాయి పార్టీ ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి.. ఎలా ఆడుతుందో?

Vijayasai Reddy New Party: VR 2026 Launch Fuels AP Politics Buzz

సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత రిలీజ్‌ చేసే వరకు పాటలు, టీజర్‌, ట్రైలర్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలు అంటూ వీలైనంతగా ప్రమోషన్స్‌ చేసుకుంటారు.

కానీ ఒక్కోసారి అవి శృతి మించితే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. వాటిని అందుకోలేక బోర్లా పడిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ADVERTISEMENT

అదేవిధంగా విజయసాయి రెడ్డి కొత్త పార్టీకి ముందస్తు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకొని, విజయదశమి నాడు రిలీజ్‌ డేట్ అని ప్రకటించారు. కనుక ఆయన కూడా తన ‘విఆర్ 2026 పార్టీ’కి యధాశక్తిన ప్రమోషన్స్‌ చేసుకుంటున్నారు.

‘మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని నేను కాను’ అంటూ బాగానే మొదలుపెట్టారు. ‘ఎప్పుడూ రెడ్లు, కమ్మలేనా?అంటూనే ‘రాయలసీమ ఒరిజినల్ రెడ్లకు మా పార్టీలో ప్రాధాన్యం’ అంటూ ప్లాన్-బీ కూడా ప్రకటించారు.‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’’ అంటూ కొత్త పార్టీకి మళ్ళీ కాస్త హైప్ క్రియేట్ చేశారు.

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్‌ అంటే నిర్దిష్టమైన ఫార్మాట్స్ ఉండేవి. కానీ ఊహించని విధంగా చేయడమే ఇప్పుడు ట్రెండ్.

కనుక విజయసాయి రెడ్డి కూడా ఇది అందిపుచ్చుకున్నట్లు నేడు తిరుపతి మీడియా సమావేశంలో మొదట హిందూమతం-చరిత్ర పాఠాలు చెప్పారు.

ఆ తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాజకీయ బొద్దింకల వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు.

అయితే ప్రతీ సినిమా ఓ కాన్సెప్ట్, ఓ జోనర్‌ ఉన్నట్లే, రాజకీయ పార్టీలకు కూడా నిర్దిష్టమైన ‘రాజకీయ జోనర్‌’ఉంటుంది.

ఉదాహరణకు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుంటుంది. మరి విజయసాయి రెడ్డి ఏ ‘రాజకీయ జోనర్‌’లో ఉన్నారో ఇంకా తెలీదు.

సినిమా రిలీజ్‌ అయ్యాక అసలు కథ అందరికీ తెలిసిపోతుంది. అలాగే విజయసాయి విజయదశమి నాడు కొత్త పార్టీ రిలీజ్‌ చేశాక దాని కథ తెలుస్తుందేమో? చూద్దాం.. ఎదురు చూద్దాం. తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడగడం దేనికి?

ADVERTISEMENT
Latest Stories