
తెలుగు సినీ పరిశ్రమలో ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని పేరు పొందిన విజయశాంతి, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించి ‘ఫైర్ బ్రాండ్ లీడర్’ అని మంచి పేరు తెచ్చుకోగలిగారు. కానీ రాజకీయంగా ఎదగలేకపోయారు అని అనే కంటే ఏ పార్టీ కూడా ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే చెప్పవచ్చు.
కేసీఆర్ ఆమెను ఎంపీగా చేసినప్పటికీ అంతకు మించి మరేమీ ఆశించవద్దన్నట్లు వ్యవహరించడంతో ఆమె దణ్ణం పెట్టేసి బీజేపీలోకి వచ్చేశారు. కానీ అక్కడా ఆమె పరిస్థితి మారలేదు.
ఎప్పటిలాగే ఈసారి కూడా బీజేపీ బలమైన అభ్యర్ధుల కోసం వెతుక్కొంటూ, ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్స్ ఇచ్చిందే తప్ప పార్టీలోనే ఉన్న విజయశాంతిని పట్టించుకోలేదు. ఈ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైనవి. కానీ విజయశాంతిని ఎన్నికల ప్రచారానికి కూడా ఆహ్వానించలేదు.
చిరకాలం రాజకీయాలలో ఉన్న ఏ రాజకీయ నాయకులైనా దీనిని చాలా అవమానంగానే భావిస్తారు. అందుకే రాములమ్మ బీజేపీకి రాజీనామా చేసింది. ఆమె నిన్న తన రాజీనామా లేఖను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపిన్నట్లు సమాచారం.
రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఆయన సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేస్తున్నట్లున్నారు. తెలంగాణలో టిడిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడాన్ని సానుకూలంగానే చూడాలంటూ ఆమె ట్వీట్ చేశారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ కూడా ఆంధ్రా రాజకీయాలలో వేలు పెట్టకుండా ఉంటే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం పెనం మీద నుంచి పొయ్యిలోకి దూకిన్నట్లే భావించవచ్చు. కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన ఈ ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీ నేతలు తమలో తాము కీచులాడుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు విజయశాంతి కూడా వారిలో చేరి ఆ కీచులాటలలో పాల్గొనక తప్పదు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వస్తే తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తాయనే గట్టి నమ్మకంతోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు భావించవచ్చు. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆ పార్టీ నేతలకు కూడా తెలీదు! కనుక విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆమె పరిస్థితిలో బహుశః ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.
కానీ తనను గుర్తించని, గౌరవించని బీజేపీలో ఉండటం ఆత్మాభిమానం కలిగిన విజయశాంతికి కష్టమే కనుక ఆమె ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు భావించవచ్చు.
The wait is finally over! The makers of Ramayana, backed by producer Namit Malhotra, have…
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…