తుఫాను, వరదలు సంభవించినప్పుడు అధికారులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తుంటారు. అలాగే విజయనగరం జిల్లాలో కూడా తరలింపు మొదలైంది. అయితే ఇది వైసీపీలో ఏర్పడిన రాజకీయ తుఫాను కారణంగా జరుగుతోంది.
నాడు గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మాట మాత్రంగానైనా చెప్పకుండా హడావుడిగా బయలుదేరిపోయినట్లు, విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణకు మాట మాత్రంగా చెప్పకుండా అయన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపిలో చేరిపోయారు.
నాడు తనకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు లక్ష్మీదేవి కన్నీళ్ళు పెట్టుకుందో లేదో తెలీదు గానీ బొత్స సత్యనారాయణ మాత్రం అల్లుడు శ్రీను ఇలా హ్యాండిచ్చేశాడేమిటని చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు.
ఇప్పుడిప్పుడే అయన ఆ షాక్ నుంచి తేరుకుంటుంటే ‘అల్లుడు శ్రీను’ ఊరుకునేలా లేడు. జిల్లాలో వైసీపీని ఖాళీ చేసేస్తానని ముందే చెప్పి మరీ చేయించేస్తుంటే, అచ్చం వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లే అనిపిస్తోంది.
చీపురుపల్లి జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, దంపతులు వైసీపీకి రాజీనామా చేసి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే మేడపై చిక్కుకున్న వరద బాధితులు హెలికాఫ్టర్ కోసం ఎదురుచూస్తున్నట్లు, జిల్లా వైసీపీలో మరో బ్యాచ్ రాజీనామాలతో రెడీ అయిపోయింది.
ఈసారి కూడా మళ్ళీ చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో ఈ తుఫాను వచ్చింది. మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావు, మరో 13 గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు, వారి అనుచరులు వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వాటితో ఫోటోలు దిగి మీడియాకు, వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు.
కనుక వైసీపీలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఇంకా అలాగే స్థిరంగా ఉందా? లేక వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారబోతోందా? అది వైసీపీ తీరం ఎప్పుడు దాటబోతోంది?
దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ముఖ్యంగా త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నేలకొరిగే వటవృక్షాలు ఎన్ని?తుఫాను ధాటిని తట్టుకొని బలంగా నిలిచే కరెంట్ స్థంభాలు ఎన్ని?అనే ప్రశ్నలకు జిల్లాలో వైసీపీ పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణే చెప్పాలి. అయినా ఈ చిన్న శ్రీను ఇంత పెద్దవాడు ఎప్పుడయిపోయాడబ్బా?





