ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుంచి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు అది కేవలం ఒక్క రోజు గ్యాప్లో రిలీజ్ కావడం ఆ మధ్య దిల్ రాజు అన్నట్టు ఒక్క మైత్రి విషయంలోనే జరిగినట్టు అనిపిస్తోంది. రెండూ పోటాపోటీగా అభిమానుల మధ్య వేడి రాజేస్తుండగా ప్రమోషన్లను బ్యాలన్స్ చేయడం నిర్మాతలకు కత్తి మీద సాములా మారింది. ఏ ఒక్కరికి అసంతృప్తి కలిగినా సోషల్ మీడియా వేదికగా తలంటుతారు కాబట్టి వీలైనంత మేరకు అలాంటివి జరగకుండా చూసుకుంటున్నారు. మొదటవచ్చిన పాటల్లో బాస్ పార్టీ పైచేయి సాధించగా రెండోది సుగుణ సుందరి, నువ్వు శ్రీదేవి రెండూ వేటికవే అభిమానులను మెప్పించేలా సాగాయి. తమన్ హవాలో దేవిఈసారి గట్టి పోటీనే ఇచ్చాడు.
తాజాగా రెండింటికి సంబంధించి మూడో సింగల్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం రిలీజైన మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి మాస్ కి బాగా ఎక్కేసింది. సోడా బండి స్టెప్పుతో పాటు మరికొన్ని బాలయ్య డాన్స్ బిట్లు ఇందులో చూపించేయడంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. తమన్ బెస్ట్ ఐటెం సాంగ్ అవుతుందా లేదా అనేదే రిలీజయ్యాక స్క్రీన్ మీద ఎలా వచ్చిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బీట్స్ విషయంలో తమన్ తీసుకున్న శ్రద్ధ, కొంత రెగ్యులర్ గా ఉన్నా క్యాచీగా అనిపించే ట్యూన్ పాటను నిలబెట్టాయి. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి నుంచి ఇలాంటి సాహిత్యం ఊహించలేదు. ఆయన పెన్ను పదును అన్ని కోణాల్లోనూ ఉంది.
ఇప్పుడు వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్ ని వదిలారు. ఉదయం నుంచి టైం చెప్పకుండా మళ్ళీ సాయంత్రం నుంచి ఆరు నుంచి ఎనిమిది మధ్యలో అని ఊరించి చివరికి ఏడు గంటలకు రిలీజ్ చేశారు. చంద్రబోస్ పవర్ ఫుల్ లిరిక్స్ తో ఉన్న పాట హీరో క్యారెక్టరైజేషన్ అని స్పష్టంగా అర్థమైపోయింది. వీడియోలో చూపించిన విజువల్స్ అన్నీ యాక్షన్ పార్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో ఏదో శత్రు సంహారం చేసినప్పుడు వచ్చే పాటలా సెట్ చేశారు. ఇదీ కూడా మరీ గొప్పగా లేకపోయినా దేవిశ్రీ ప్రసాద్ గత కొన్ని ఆల్బమ్స్ తో పోలిస్తే చాలా బెటర్ అనిపిస్తోంది. సింగర్ వాయిస్, బీట్స్ అన్నీ వెస్ టర్న్ స్టైల్ లో సాగిపోయాయి. ఇదీ పాసే.
తర్వాత చెరో రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అవి వచ్చాకే తేలుతుంది. మొత్తానికి తమన్ దేవిలు తమ మీద పెట్టుకున్న అంచనాలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారని ప్రస్తుతానికి చెప్పలేకపోయినా పూర్తి ఆల్బమ్ తో పాటు ఆయా సినిమాలకు ఇచ్చిన బీజీఎమ్ ని బట్టి ఫైనల్ జడ్జ్ మెంట్ ఇవ్వొచ్చు. దేవికి ప్రస్తుతం వాల్తేరు వీరయ్యకు సంబంధించిన వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. కానీ తమన్ వీరసింహరెడ్డితో పాటు అటు వారసుడు స్కోర్ తాలూకు పనులను చూసుకోవాలి. చిరు బాలయ్య గురించి మాత్రమే పోలిక వస్తోంది కానీ వారసుడు, తునివు పాటలు, అప్డేట్లను మన ఆడియన్స్ అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.



