జూనియర్ స్పష్టంగా ఉన్నప్పుడు అక్కర్లేని ప్రచారాలకు విలువెక్కడిది

Jr NTR Political Entryరాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరోసారి పొలిటికల్ న్యూస్ లోకి వచ్చాడు. తానుగా ఏమీ చెప్పకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉన్న లోకేష్ అన్న మాటలను ఓ వర్గం మరోవిధంగా అర్థం తీయడంతో ఇదంతా జరిగింది. నిజానికి తెలుగుదేశంతో తారక్ ఏనాడూ బ్రేకప్ చెప్పుకోలేదు. కేవలం కెరీర్ ని సీరియస్ గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే పాలిటిక్స్ కి స్వస్తి చెప్పి షూటింగులే ప్రపంచంగా ఉండిపోయాడు. బిగ్ బాస్ హోస్టింగ్ చేసినా ఎవరు మీలో కోటీశ్వరులుకి యాంకర్ గా మారినా అదంతా ప్రేక్షకులకు ఇంకా చేరువ కావడం కోసమే.

జూనియర్ కు చంద్రబాబునాయుడు లోకేష్ లతో కానీ బాబాయ్ బాలకృష్ణతో ఎలాంటి భేదాలు లేవు. బయట కలుసుకున్న సందర్భాలు రాకపోవడం వల్ల వేరే ప్రచారానికి ఆస్కారం దొరికిందే తప్ప ఇంకో కారణం కనిపించదు. తారక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తానేంటో అందరికీ తెలిసొచ్చింది. రేపు నాటునాటుకి ఆస్కార్ వస్తే తను చరణ్ కలిసి చేసిన డాన్సులే ఆ విజయంలో కీలక పాత్ర పోషించాయని అందరూ ఒప్పుకుంటారనే వాస్తవం బాగా తెలుసు. అందుకే అడుగులు జాగ్రత్తగా వేస్తున్నాడు.

ADVERTISEMENT

నిజానికి ఆచార్య కనక కనీసం యావరేజ్ అయినా కొరటాల శివ సినిమా ఈపాటికి సగమైనా అయిపోయేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఇద్దరిది. అందుకే ఎంత ఆలస్యమైనా సరే క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయానికి వచ్చి ఏడాది సమయం కేవలం రైటింగ్ కోసమే కేటాయించారు. ఇమేజ్ ని నిలబెట్టుకునే విషయంలో జూనియర్ చాలా పట్టుదలతో ప్లానింగ్ తో ఉన్నాడు. కెజిఎఫ్ సలార్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రశాంత్ నీల్ తో చేతులు కలపడం ఎదుగుదలలో భాగమే.

చుట్టూ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కన్నా సుఖం మరొకటి ఉండదు. ఏ రకంగా స్పందించినా సోషల్ మీడియాలో అది ఇంకో కోణంలో వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా చేసింది ముప్పై సినిమాలే. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. బాలకృష్ణ యువకుడిగా కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడు ఎంత అవసరం ఉన్నా సరే టిడిపి కోసం నేరుగా దిగలేదు. బావ చంద్రబాబునాయుడుకే వదిలేశారు. బ్లాక్ బస్టర్లు రికార్డులు పీక్స్ చూశాక పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జూనియర్ చేయాల్సింది కూడా ఇదే. ప్రభాస్, అల్లు అర్జున్, తను, చరణ్ ఇలా టాలీవుడ్ నుంచి వందల కోట్ల మార్కెట్ లీగ్ పెరుగుతోంది. దృష్టికి పక్కకు మళ్లించే ఏ ఆలోచనా చేయకపోవడమే మంచిది.

ADVERTISEMENT
Latest Stories