మస్క్‌ టైమింగ్‌ యాదృచ్ఛికమేనా?

Elon Musk vs Ambani: Starlink Row Raises Political Questions

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశాలు జోక్యం చేసుకుని, ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయని నాడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. విదేశీ జోక్యాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

అయితే, తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన జోక్యం చేసుకోని దేశం లేదనే చెప్పాలి. ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద పుస్తకమే అవుతుంది. కనుక సింపుల్‌గా రష్యా, ఉక్రెయిన్‌, వెనిజువెలా, ఇరాన్‌, భారత్‌, చైనా, యూరప్‌.. ఇలా ఆయా దేశాల పేర్లు చెప్పుకుంటే చాలు. వాటికి సంబంధించిన కథనాలు సినిమా సన్నివేశాల్లా కళ్ల ముందు కదలాడతాయి.

ADVERTISEMENT

ఇంతకీ విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు కోసం ఉడతా భక్తిగా తోడ్పడిన ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు భారత్‌ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం.

మస్క్‌ తన స్టార్‌లింక్‌ సేవలను భారత్‌లో ప్రారంభించాలనుకుంటున్నారు. అయితే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ‘రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ తన వ్యాపార ప్రయోజనాల కోసమే స్టార్‌లింక్‌ ప్రవేశానికి అడ్డుపడుతున్నారని మస్క్‌ సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించారు.

అయితే అక్కడితో ఆగి ఉంటే ఇలాంటి అనుమానం వచ్చేదే కాదు. ‘భారత్‌కు ప్రధాని ఎవరు? అంబానీయా?’ అని మస్క్ అడిగిన ప్రశ్న భారత రాజకీయవర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంటే విదేశీయులైనా భారత్‌ రాజకీయాలను ప్రభావితం చేయగలరని స్పష్టమవుతోంది.

అయితే అంబానీపై మస్క్‌ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యాపారపరమైన అసంతృప్తితో చేసినవేనా? లేక వాటి వెనుక మరేదైనా రాజకీయ కోణం కూడా ఉందా?

ఓ పక్క సీజేపీ, మరోపక్క కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు చేస్తున్నాయి.

సరిగ్గా ఈ సమయంలోనే రాజకీయాలను ప్రభావితం చేసేవిధంగా మస్క్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికమేనా? అనే అనుమానం కలగకమానదు.

మోదీ ప్రభుత్వంపై దేశీయంగా రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, అంతర్జాతీయ వ్యాపారవేత్తగా మస్క్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అనుమానం కలిగేలా చేస్తున్నాయి.

మోదీ ప్రభుత్వంపై దేశీయ రాజకీయ పక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతకు, అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలు, అంతర్జాతీయ సంబంధాలు, వివాదాలు కూడా తోడవుతున్నాయా?

తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు భంగం కలుగుతోందని భావిస్తున్న శక్తుల మధ్య ఏమైనా ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయా? కాంగ్రెస్‌ హస్తంతో పాటు విదేశీ హస్తం కూడా ఉందా?

జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ-అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలు ఒకదానితో మరొకటి ముడిపడే అవకాశం ఉంటుంది.

రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్‌ యుద్ధాలతో ఆయుధాలు, చమురు వ్యాపారాలు ముడిపడినట్లే ఇదీను అనిపిస్తుంది. అయితే, ఇవి కేవలం అనుమానాలు మాత్రమే.

ఈ ప్రశ్నలకు కాలమే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సమాధానం చెపుతుంది. అంతవరకు ఈ అనుమానాలను వాస్తవాలు అనుకోవడం తొందరపాటే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories