అచ్చియమ్మ గురించి ఎందుకు ఇంత చర్చ?

Why Is Janhvi Kapoor's Peddi Role Facing So Much Criticism?

పెద్ది సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన సమయంలో జాన్వీ కపూర్‌ గురించి మాట్లాడుకోవాల్సి రావడం విచిత్రమే. మహానటి సినిమాలో కీర్తి సురేష్ సావిత్రిగా మెప్పించి అందరూ తన గురించి మాట్లాడేలా చేసుకున్నారు.

ఒకవేళ పెద్దిలో అచ్చియమ్మ పాత్ర కూడా అంత అద్భుతంగా ఉండి ఉంటే జాన్వీ కపూర్‌ గురించి మాట్లాడుకున్నా అర్థం ఉండేది. కానీ ఆ సినిమాలో ఆమె అందాల ప్రదర్శన, బూతుల గురించి చర్చ మొదలై, అది తీవ్ర విమర్శలకు దారి తీయడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పుకొని ఆమె నటించిన అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

అయితే నేటికీ పెద్దిలో అచ్చియమ్మ పాత్రపై విమర్శలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. బహుశః అందుకే పెద్ది సక్సస్ మీట్‌కు జాన్వీ కపూర్‌ హాజరు కాలేదేమో? ఆ వేడుకలో ఎవరూ ఆమె ప్రస్తావన చేయకపోవడంగమనిస్తే ఇదొకపొరపాటని అందరూ అంగీకరించినట్లే భావించవచ్చు.

అయితే పెద్దిలో జాన్వీ కపూర్‌ పాత్ర గురించి ఇన్ని విమర్శలు, అభ్యంతరాలు చెప్తున్నవారు అదే సినిమాలో శ్రుతీ హాసన్ చేసిన ఐటం సాంగ్‌ గురించి మాట్లాడకపోవడం విశేషం. సినిమాలో హీరోయిన్ చేత ఆవిధంగా చేయించడం తప్పన్నప్పుడు ఐటం సాంగ్‌ కూడా తప్పేగా?

పెద్దిలో జాన్వీ కపూర్‌ పాత్ర, డ్రెస్సింగ్ గురించి బాలీవుడ్‌ సీనియర్ నటి జయ బచ్చన్ కూడా స్పందించారు. షూటింగ్‌ సమయంలోనే హీరోయిన్లు అభ్యంతరం చెప్పగలిగితే ఎవరూ ఆవిధమైన దుస్తులు ధరించమని అడిగే సాహసం చేయరని జయా బచ్చన్ అన్నారు.

కానీ జాన్వీ కపూర్‌ ఓ పేరు మోసిన నటి… జూనియర్ ఆర్టిస్ట్ కాదు అచ్చియమ్మ పాత్ర.. డ్రెస్సింగ్ తీరు నచ్చకపోయినా చేయడానికి. ఆమె కాదంటే బుచ్చిబాబు ఈవిధంగా చేయించి ఉండేవారు కారు.

కానీ “అందరినీ డామినేట్ చేసే ఈ పాత్రని నేను ఇష్టపూర్వకంగానే చేశానని” ఆమె స్వయంగా చెప్పుకున్నారు. కనుక అక్కడ ఎవరి బలవంతమూ లేదని అర్ధమవుతూనే ఉంది.

సినీ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కనుక నటీనటులు దేనికైనా రెడీ అన్నట్లే వస్తారు. ప్రేక్షకులు చూస్తున్నారు లేదా చూడాలనుకొంటున్నారు గాబట్టి మేము చూపిస్తున్నామని దర్శక నిర్మాతలు, నటీనటులు సమర్ధించుకుంటారు.

మా సినిమా గొప్పగా ఉందని చెప్పుకుంటూ చూపిస్తున్నారు గాబట్టి చూస్తున్నామని ప్రేక్షకులు చెప్పుకుంటారు. కనుక తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు సినిమాలలో హీరోయిన్ల అందాల ప్రదర్శనలకు అందరూ కారణమే.

కనుక ఎవరు ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. పెద్ది తర్వాత మరే సినిమాలో హీరోయిన్ల అందాల ప్రదర్శనలు, ఐటెం సాంగులు ఉండవని ఎవరైనా హామీ ఇవ్వగలరా? అంటే సమాధానం అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు అచ్చియమ్మ గురించి ఎందుకు ఇంత చర్చ?

ADVERTISEMENT
Latest Stories