
తెలంగాణ ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో తెలంగాణ మహిళలలో కూడా ఉద్యమ స్పూర్తి రగిలించి ఘనత ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకే దక్కుతుంది.
ఆమె తెలంగాణ జాగృతి అధ్వర్యంలో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండగని ఊరూవాడా ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ మహిళలలో సామాజిక ఐక్యత సాధించి, వారిని కూడా ఉద్యమాలలో భాగస్వామిగా చేశారు.
ఒకప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటాలు జరుగుతున్నప్పుడు దేశ ప్రజలలో సామాజిక ఐక్యత కలిగించేందుకు గోపాలకృష్ణ గోకలే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.
కల్వకుంట్ల కవిత కూడా అదే స్పూర్తితో బతుకమ్మతో తెలంగాణ మహిళలను ఏకం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ సంస్కృతీ సంప్రాదాయాలకు అత్యంత గౌరవం, ప్రాధాన్యం ఇస్తూ వాటి పట్ల ఇతరులలో నెలకొన్న చులకన భావాన్ని సమూలంగా తుడిచిపెట్టేశారు.
దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు ప్రజలను ఇంతగా ప్రభావితం చేయగలవని కల్వకుంట్ల కవిత మరోసారి నిరూపించారు. కనుక ఆ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించడం, కాపాడుకోవడం చాలా అవసరం.
అయితే నాడు తెలంగాణ సాధనకు ఎంతగానో ఉపయోగపడిన బతుకమ్మ పండగని ఇప్పుడు కల్వకుంట్ల కవిత తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం, తన మనుగడ కాపాడుకోవడం కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లున్నారు.
కానీ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెకున్న ఇమేజ్ వేరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైల్లో ఆరు నెలలు ఉండి వచ్చిన తర్వాత ఆమె ఇమేజ్ చాలా మారింది.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఇమేజ్ ఒకలా ఉంటే, తండ్రి చేత గెంటించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇమేజ్ వేరేగా ఉంది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వెంట నడించేందుకు ఎవరూ రావడం లేదు. ఆమె మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెనుక నిలబడి తలలు ఊపేవారిలో ఏ ఒక్కరూ ప్రజలకు పరిచితులు కారు.
కనుక ఆమె తన రాజకీయ మనుగడ కోసం చేస్తున్న ఈ పోరాటంలో బతుకమ్మ ఆడిపాడితే రాష్ట్రంలో మహిళలందరూ తన వెంటవస్తారని అనుకుంటే అది భ్రమగానే భావించాలి.
తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరూ ఆమెతో కలిసి రానప్పుడు విదేశాలలో అదీ… మాల్టా వంటి దేశాలలో బతుకమ్మ ఆడిపాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే తెలంగాణ జాగృతికి కొద్దిపాటి విరాళాలు అందితే అందవచ్చు తప్ప మరేమీ ఒరగదనే చెప్పాలి.
కనుక కల్వకుంట్ల కవిత రాజకీయాలలో కొనసాగాలి… ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా ఆమె సరైన మార్గం ఏదో గుర్తించి ముందుకు సాగడం మంచిది. లేకుంటే చివరికి నవ్వులపాలయ్యి అర్ధంతరంగా రాజకీయాల నుంచి తప్పుకోవలసి ఉంటుంది.
It has been more than a couple of years since the formation of the NDA…
Kangana Ranaut and Vijay Deverakonda have previously sought protection of their personality rights, and the…