తెలంగాణ ఎన్నికల ఫలితాలలో అన్నిసర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉండబోతున్నాయంటూ తమ నివేదికలను వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఫలించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినాఅధికార పీఠం దక్కించుకుంటుందా? అంటే అది సందేహమే.
“కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు”..,అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠం దక్కకపోవడానికి కూడా అంతకంటే ఎక్కవ కారణాలే కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువ… నాయకత్వం తక్కువ.అలాగే నాయకులకు స్వాతంత్య్రం ఎక్కువ…క్రమశిక్షణ తక్కువ.ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే…పోటీకి అనేక మంది సిద్ధం. నాయకులకు అనుభవం ఎక్కువ…సహనం తక్కువ.ప్రలోభాలు ఎక్కువ…నిలకడ తక్కువ.
పార్టీ మీద ప్రేమ కన్నా వ్యక్తిగత స్వార్దానికే ప్రాధాన్యత ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువ.అదే కాంగ్రెస్ పార్టీకి బలహీనంగా మారి, ప్రత్యర్థి పార్టీలకు బలంగా మారుతుంది. పార్టీకి నేనంత చేయాలి అనుకునే నాయకులకన్నా పార్టీ నుండి తనకెంత రావాలి అనే ఆలోచన చేసే నాయకులే కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం. పార్టీ అధికారంలోకి వచ్చింది అని ఆనందపడే లోపే ఆ ఆనందాన్ని ఆవిరి చేయగల సమర్థులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది ఒక్క టి.కాంగ్రెస్ సమస్య మాత్రమే కాదు. దేశంలో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదేవిధంగా ఉంది.
చేతికొచ్చిన ముద్దా నోటిదాకా రాకుండా ఉన్న రాష్ట్రాల పరిస్థితే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అధికారం వచ్చింది అని ఆనందపడే లోపే ప్రతిపక్షం లోకి వచ్చేసారు. పార్టీ గెలిచింది అన్న అనందం కన్నా ఏ నాయకుడు ఏ పార్టీలోకి జంప్ అయ్యి పార్టీకి హ్యాండ్ ఇస్తాడో అన్న టెన్షన్ అధిష్టానానికి ఎక్కువ. క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాలి. పదవుల పంజారం చేయాలి. నాయకుల గొంతెమ్మ కోరికలు తీర్చాలి.ఇలా పార్టీ అధిష్టానానికి నెలవారీ సరుకుల చీటీ లెక్క ఒక్కో నాయకుడి కోరిక లిస్ట్ వెళ్తుంది.
ఇంతా చేసినా పార్టీలో నిలకడగా రాణిస్తారా అంటే అది అనుమానమే. నాకు దక్కకపోయినా పరవాలేదు పక్కవాడికి దక్కకూడదు. ప్రత్యర్థి పార్టీ గద్దెనెక్కినా సహించగలరు కానీ సొంత పార్టీలో ప్రత్యర్థి అనుకున్న నాయకుడికి మాత్రం పదవి దక్కకూడదు అనే ప్రాథమిక సూత్రంతో కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులు తమ రాజకీయాన్ని నడుపుతారు.ఇదే ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా మలుచుకుని అధికారానికి అవసరమైన స్థానాలు సంపాదించుకోలేక పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో తమ పార్టీ జెండా ఎగరేస్తాం అని నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నారు.




