ఏపీ పాలిటిక్స్ లో వైస్ షర్మిల రీఎంట్రీ తో వైస్ జగన్ పరిస్థితి “పేనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది.” వైసీపీ ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ విధానాల మీద కానీ ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా, సూచనలు ఇచ్చినా సహించలేని జగన్ అండ్ కో అటువంటి వారి పై విమర్శలు చేయడానికి ఏ స్థాయికైనా దిగజారాగలరని ఎన్నో సార్లు రుజువుచేసారు, ఇప్పటికి చేస్తూనే ఉన్నారు కూడా.
సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలుకుని మెగాస్టార్ చిరంజీవి వరకు ఎవ్వరు తమ పార్టీ నేతల విమర్శలకు అతీతులు కాదని నిరూపించిన వైకాపా నేతలు, చంద్రబాబు సతీమణి నుంచి పవన్ కళ్యాణ్ భార్య వరకు ఎవ్వరి పైన కనికరం చూపకపోవంతో ఒకానొక సందర్భంలో ఏపీ రాజకీయాలు ఎటువైపుకి వెళుతున్నాయనే సందేహాన్ని కలిగించాయి.
అలాగే తన తండ్రి హత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయపోరాటం చేస్తున్న వివేకా కూతురు వైస్ సునీతా రెడ్డి పై కూడా వైసీపీ సోషల్ మీడియా వ్యక్తిగత హననానికి పూనుకోవడం, వైసీపీ పార్టీ రాజకీయాలలో తమకు ఎదురునిలుస్తే సొంత కుటుంబంలోని ఆడవారినైనా ఉపేక్షించేది లేదని నిరూపించుకుంది.
ఇప్పటివరకు చెప్పుకున్న వారి పై వైసీపీ నాయకులో, నేతలో, కార్యకర్తలో, వైసీపీ సోషల్ మీడియా వర్గాలో అసభ్యకరమైన విమర్శలకు పాల్పడితే, వారిని కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్ నేరుగా బహిరంగ సభలలోనే పవన్ పెళ్లిళ్లు, పెళ్ళాలు అంటూ మాట్లాడడం ఇక్కడ చర్చనీయాంశమయ్యింది. రాజకీయాలలోకి వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టి రాజకీయాలతో సంబంధం లేని ఆడవారిని బహిరంగ వేదికల సాక్షిగా బజారుకి లాగడం ఎంత వరకు సమర్ధనీయమో వైస్ జగన్ సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది.
రాజకీయాలలోకి అడుగుపెట్టిన వారికి వ్యక్తిగత జీవితం అంటూ ఏముండదంటూ పవన్
పెళ్లిళ్ల పై జగన్ విమర్శలను తప్పుబట్టే వారికి కౌంటర్ వేస్తున్న వైకాపా నాయకులు, వారి అధినేత జగన్ ఇప్పుడు వైస్ షర్మిల వ్యక్తిగత జీవితం పై కూడా అటువంటి విమర్శలే చేయగలరా..? అనే ప్రశ్న సర్వత్రా చర్చకు వస్తుంది. జగన్ ఆ స్థాయికి దిగితే షర్మిల పవన్ మాదిరి రాజకీయ విలువలకు కట్టుబడి మోనంగా ఉంటుందా..? లేక ఎవ్వరి ఊహకు అందని సమాధానంతో వైసీపీ కి కౌంటర్ వేస్తుందా..? అనేది కాలమే సమాధానం చెప్పాలి.
ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా వైస్ షర్మిల పై తనదైన స్థాయి విమర్శలు మొదలుపెట్టింది. షర్మిల ఇంటి పేరు నుంచి కులం పేరు వరకు, షర్మిల మొదటి భర్త నుంచి ఇప్పటి అనిల్ వరకు ఎవ్వరికి తెలియని షర్మిల వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో అందుబాటులోకి తెచ్చారు జగన్ మద్దతుదారులు. మరి జగన్ కూడా సొంత తోబుట్టువు షర్మిల పైన ఇటువంటి విమర్శలకు దిగుతారా..? లేక రాజకీయంగా ఎదుర్కుంటారా..? అనేది వేచి చూడాలి.




