
మరో పది రోజులలో ఆంధ్రాలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయి, ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. కనుక ఇటు వైసీపి, అటు టిడిపి, జనసేన, బీజేపీలు కూడా జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి.
ఈ నెల 6వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రాజమండ్రి నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరిలతో కలిసి వేమగిరిలో ప్రజాగళం సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం వారు ముగ్గురూ కలిసి అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు.
ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ 8న తిరుపతికి వస్తారు. ఆరోజు పీలేరు పరిధిలోని కలికిరి వద్ద మూడు పార్టీల అధ్వర్యంలో నిర్వహించే ప్రజాగళం ఎన్నికల సభలో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోడీ, బాబు, పవన్ ముగ్గురూ కలిసి రోడ్ షో నిర్వహిస్తారు.
టిడిపి, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ నేటికీ కేంద్రం కేంద్ర ఎన్నికల కమీషన్ ద్వారా వైసీపి పెట్రేగిపోకుండా అడ్డుకోకపోవడంతో టిడిపి, జనసేనలు చాలా అసహనంగా ఉన్నాయి.
ఇటీవల మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు అనుచరులు టిడిపికి చెందిన యశ్వంత్ అనే యువకుడిని చితకబాదారు. ఎన్నికల సమయంలో వైసీపి ఈవిదంగా చెలరేగిపోతుందని చంద్రబాబు నాయుడు ముందే ఊహించారు.
కనుక దానిని కేంద్ర ఎన్నికల కమీషన్ మాత్రమే కట్టడి చేయగలదని భావించారు. కానీ అది, రాష్ట్ర ఎన్నికల సంఘం రెండూ కూడా ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యాయని టిడిపి, జనసేనలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా జనసేన ఎన్నికల గుర్తు గాజుగ్లాసు విషయంలో కూడా కేంద్ర ఎన్నికల కమీషన్ తమ పార్టీకి నష్టం కలిగించేలా నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో బీజేపీ తమ వైపు ఉందా లేదా తమవైపు ఉంటూ వైసీపికి సాయపడుతోందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు ఇంత దగ్గర పడిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఆయన ఫోటో ముద్రించలేదు కనుక ఆ మ్యానిఫెస్టోతో, దానిలో టిడిపి, జనసేనలు ఇచ్చిన హామీలతో బీజేపీకి ఎటువంటి సంబందమూ లేదని వైసీపి దుష్ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ ఏమైనా జవాబు చెప్తారా?
ఈ ఎన్నికలలో తమ కూటమిని గెలిపించుకునే విదంగా ఏమైనా చెప్తారా? చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌ని పట్టి పీడిస్తున్న వైసీపిని, దాని పాలనలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఏమైనా హామీ ఇస్తారా?అనేక ప్రశ్నలు వినబడుతున్నాయి.
ముఖ్యంగా టిడిపి, జనసేనలతోనే బీజేపీ ఉందని, అమరావతితో సహా ఉమ్మడి మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు కేంద్రం మద్దతు ఉందని ప్రధాని నరేంద్రమోడీ విస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏపీలో పర్యటించి ప్రయోజనం ఉండదు.
Neha Sharma brings a rich dose of festive glamour to this coral pink photoshoot. Her…
Jana Sena Party’s proposed seat share for Andhra Pradesh urban local body elections has triggered…