
ఈ నెల 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. వీటిలో జనసేన కూడా బలమున్న స్థానాలలో పోటీ చేస్తోంది. ఇప్పటికే జనసేన అభ్యర్ధులు కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. కనుక వారి అధినేత, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా వారికి మద్దతుగా ఈ నెల 7,8 తేదీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్, షెడ్యూల్ ఖరారు చేయగానే ప్రకటిస్తామని జనసేన తెలిపింది.
ఒకప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్-బిజేపిల మద్యనే పోటీ సాగేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్-బిజేపిల మద్య పోటీ జరగాల్సి ఉండగా, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటోంది.
కనుక తెలంగాణలో బిజేపి చాలా బలంగా ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, ఆ తర్వాత పంచాయితీ ఎన్నికలలో మూడో స్థానంతో సరిపెట్టుకుంటూ రేసులో వెనుక బడిపోయింది. అయినప్పటికీ జనసేనతో పొత్తు అవసరం లేదని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించగలమని తెలంగాణ బిజేపి నేతలు చెప్పారు.
కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడు, బిజేపి తరపున కూడా ఎన్నికల ప్రచారం చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. కనుక పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజేపి తరపున కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కూడా వాటి మద్య నిలద్రొక్కుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో జనసేన విస్తరణకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?అనే సందేహం కలుగుతుంది.
ఒకవేళ ఈ ఎన్నికలు లేదా మరో ఎన్నికలలో జనసేన కొన్ని సీట్లు గెలుచుకున్నా ఒంటరిగా మనుగడ సాగించడం చాలా కష్టం. గెలిచినా అభ్యర్ధులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఒత్తిళ్ళు, ప్రలోభాలకు తలొగ్గి వాటిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక తెలంగాణలో బిజేపితో పొత్తు పెట్టుకోగలిగితే దాని సాయంతో ఈ సమస్యని జనసేన అధిగమించవచ్చు. లేకుంటే పవన్ కళ్యాణ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…